గుంటూరు జిల్లా మూడు జిల్లాలుగా విడిపోనుంది. దీనికి సంబంధించి కసరత్తు వేగంగా సాగుతోంది. ప్రస్తుతం గుంటూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు అదనంగా బాపట్ల, నరసరావుపేట జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతిపాదిత నరసరావుపేట జిల్లాలో 28 మండలాలు ఉండనున్నాయి. గురజాల రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు, నరసరావుపేట డివిజన్లో 11 మండలాలు, గుంటూరు రెవెన్యూ డివిజన్ నుంచి 8 మండలాలు కొత్త జిల్లాలో చేరనున్నాయి. నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల మున్సిపాల్టీలు, గురజాల, దాచేపల్లి నగర పంచాయతీలు నరసరావుపేట జిల్లాలో భాగం కానున్నాయి.
లోక్సభ స్థానం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నందున ప్రకాశం జిల్లాలోని పర్చూరు, చీరాల, అద్దంకి, సంతనూతపాడు నియోజకవర్గాలతోపాటు గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలు బాపట్ల జిల్లా పరిధిలోకి వస్తాయి. మండలాల వారీగా చూస్తే గుంటూరు జిల్లాలోని 12 మండలాలు, ప్రకాశం జిల్లాలోని 17 మండలాలు....మొత్తం 29 మండలాలు బాపట్ల జిల్లా పరిధిలోకి రానున్నాయి. అలాగే ప్రకాశం జిల్లా నుంచి అద్దంకి, చీరాల మున్సిపాల్టీలు, గుంటూరు జిల్లా నుంచి బాపట్ల, రేపల్లె మున్సిపాల్టీలు బాపట్ల జిల్లాలోకి వస్తాయి.
గుంటూరు నగరంతోపాటు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, పొన్నూరు మున్సిపాల్టీలు...మరో 17 మండలాలు గుంటూరు జిల్లా పరిధిలో కొనసాగే అవకాశముంది.
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఇటీవల అధికారులు పరిశీలించారు. బాపట్లలో ఉప సభాపతి కోన రఘుపతితో... నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో అధికారులు సమావేశమై చర్చించారు. మ్యాపులను పరిశీలించి తాత్కాలికంగా ప్రభుత్వ భవనాల లభ్యత, శాశ్వత కార్యాలయాల నిర్మాణాలకు ఖాళీ స్థలాల అన్వేషణ పరిశీలించారు. బాపట్లలో మానవవనరుల అభివృద్ధి సంస్థలో 20వేల చదరవు అడుగుల విస్తీర్ణంలో భవనాల లభ్యత ఉంది. నరసరావుపేట మున్సిపాల్టీలో తాత్కాలికంగా ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు మిగతా ప్రభుత్వ భవనాల లభ్యతను అంచనా వేస్తున్నారు. అవసరమైతే ప్రైవేటు కళాశాలల్లో వసతులను పరిశీలిస్తున్నారు. శాశ్వత భవనాలు నిర్మించేందుకు...ఇక్కడ మున్సిపాల్టీ పరిధిలోని స్థలాలతోపాటు ఇక్కుర్తి, లింగంగుంట్ల, ములకలూరు గ్రామాల్లోని స్థలాలు సైతం పరిశీలనలో ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం, పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధ్యక్షతన ఇటీవల జిల్లాస్థాయి కమిటీ సమావేశమైంది. జిల్లా ఉన్నతస్థాయి అధికారులతో కూడిన నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. సరిహద్దుల గుర్తింపుతోపాటు ప్రస్తుతమున్న కార్యాలయాల్లో పక్కా భవనాలున్నవి, అద్దె భవనాల్లో ఎన్ని కొనసాగుతున్నాయనే విషయమై శాఖల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో వివిధ శాఖల ఫైళ్లను ఆ మేరకు విభజించాల్సి ఉంటుంది. కార్యాలయాల నిర్వహణకు వస్తుసామగ్రి, కంప్యూటర్లు, స్కానర్లు, బీరువాలు, టేబుళ్లు, కుర్చీలు వంటివి సమకూర్చుకోవాల్సి ఉన్నందున... వాటి వివరాలను క్రోడీకరించాల్సి ఉంది.
ఇదీచదవండి