ఆక్వా సాగులో రొయ్య(PRAWNS FARMING) పెంపకందారులు కొత్త విధానాల కోసం అన్వేషిస్తున్నారు. రొయ్యపిల్లల లభ్యత తక్కువగా ఉండటంతో.. రైతులు ముందస్తు చెల్లింపులు చేసి నెలల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా గుజరాత్‌లో ఒక్కరి వద్ద మాత్రమే రొయ్య పిల్లలు దొరుకుతుండడం వల్ల కొరత కూడా ఏర్పడింది. వారు విదేశాల నుంచి తల్లిరొయ్యలను దిగుమతి చేసుకుని, రొయ్యపిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు విక్రయిస్తున్నారు. ఈ సమస్యలకుతోడు వ్యాధుల తీవ్రత కూడా వేధిస్తుండడంతో నష్టాలు చవిచూస్తున్నారు.
ఇప్పటి వరకూ.. వనామీ రొయ్యల సాగుతో తీవ్రంగా నష్టాలు చవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి "మోనోటైగర్" రకం విత్తనం అందివచ్చింది. ఈ కొత్తరకం సీడ్ సాగు చేపట్టడంతో.. దిగుబడులు బాగుండడమేకాకుండా ధర కూడా ఆశాజనకంగా ఉంటోంది. దీంతో సాగుదారులంతా ఈ విత్తనమే కావాలంటున్నారు.
నెల్లూరు నుంచి విశాఖ వరకు తీర ప్రాంతంలో మోనోటైగర్ సాగు విస్తరిస్తోంది. ఇప్పటికే తొలి పంట తీసుకున్న రైతులకు ఎకరాకు సగటున రూ. 5 లక్షల వరకు లాభాలు రావడం వల్ల.. మిగిలినవారు కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు.
మోనోటైగర్ రొయ్యల(MONO TIGER VARIETY OF PRAWNS FARMING BY GUNTUR DISTRICT FARIMING) సాగుకు ఎకరాకు సగటున 2 లక్షల పెట్టుబడి పెడితే సరిపోతుంది. దాదాపు 5 నెలల కాలంలోనే దిగుబడులు చేతికొస్తాయి. 20 కౌంట్ ధర సగటున రూ. 700 రైతు పొలం వద్దే లభిస్తోంది. వ్యాపారులు పోటీపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఎకరా చెరువులో 30వేల రొయ్యపిల్లలు వేస్తున్నారు. 20 కౌంట్ వచ్చేవరకు పెంచినా వ్యాధుల బెడద లేకపోవడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం గణపవరంలో ఒక రైతు సాగుచేసిన చెరువులో.. 12 కౌంట్ రావడంతో కిలో రూ. 820 కి విక్రయించారు.
టైగర్, వనామీ రొయ్యల సాగుతో పోల్చితే అన్నివిధాలా అనుకూలంగా ఉండటంతో మోనోటైగర్ రొయ్యసాగుకు(MONO TIGER PRAWNS FARMING) మొగ్గుచూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:
CONTRACT FACULTY: ఎయిడెడ్ సిబ్బంది, సాధారణ బదిలీలతో ఒప్పంద అధ్యాపకులకు గండం