Minister Kakani on Farmers Day: రైతులు మూస ధోరణిలో ఒకే తరహా పంటలను పండించి నష్టపోకుండా.. డిమాండ్ ఉండి, మంచి ధరలు దక్కే పంటలను సాగు చేయటంపై దృష్టి సారించాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సూచించారు. గుంటూరు లామ్ ఫామ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాయంలో నిర్వహించిన రైతు దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ. 3వేల కోట్ల కేటాయించామని, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోపే పరిహారం అందజేయడం, పంటల బీమా, తదితర పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం 11 స్థానంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం.. రానున్న రోజుల్లో మొదటి స్థానంలో నిలవాలని.. ఆ విధంగా శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు. అగ్రి పాలీసెట్ ఫలితాలను మంత్రి కాకాణి విడుదల చేశారు. సేంద్రీయ వ్యవసాయ విధానాలపై రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు. అంతకుముందు వర్సిటీ క్యాంపస్‌లో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటి ఆ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.