రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలపై పోలీసుల దాడులు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వీటిపై డీజీపీ గౌతం సవాంగ్‌కు కన్నా లేఖ రాశారు. ఇలాంటి దాడులు దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
అమానవీయం.. అనాగరికం
తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ యువకుడికి శిరోముండనం అత్యంత అమానవీయ, అనాగరిక చర్యగా పేర్కొన్నారు. భాజపా తరఫున ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు వారి దృష్టికి తెస్తున్నామని... అయితే కేసులు తగ్గడానికి బదులు పెరుగుతుండటం నిరాశపరిచిందని లేఖలో అన్నారు. సీతానగరం పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య చరిత్రలో క్షమించరాని చర్యగా అభివర్ణించారు. ఇలాంటి అనాగరిక చర్యలను భాజపా తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
సమగ్ర దర్యాప్తు చేయండి
ఇలాంటి వాటికి పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం, కేసులు నమోదు చేయడం సరిపోదని... అధికార పార్టీ నాయకులతో వారి సంబంధాలు తేల్చాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ వరకు సంబంధిత పోలీసు సిబ్బంది అందరి కాల్ డేటా పరిశీలించి దర్యాప్తు చేయాలన్నారు. భవిష్యత్తులో పోలీసులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడకుండా చూడాలని కోరారు.
ఇవీ చదవండి...
రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై మానవ హక్కుల కమిషన్‌కు వర్ల రామయ్య లేఖ