CJI Justice NV Ramana: ఈ తరం విద్యార్థులు తరగతి గదులకే పరిమితమవుతున్నారని, మిగతా ప్రపంచంతో వారికి సంబంధం ఉండటం లేదని, వారిలో సామాజిక భాగస్వామ్యం కొరవడుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మన విద్యా వ్యవస్థలో సమూల మార్పు జరగాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యాల్ని అలవర్చే విద్యా విధానాన్ని అభివృద్ధి చేయడం ప్రస్తుతం అవసరమన్నారు. ‘సామాజిక అంశాలపై స్పృహ కలిగిన పౌరుల్ని తయారు చేయడంపై విద్యా సంస్థలు దృష్టి పెట్టాలి. మన చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని, భవిష్యత్ దార్శనికతతో మిళితం చేసేలా ఉండాలి. సరైన అవగాహన, పరిజ్ఞానంతో సమాజాన్ని మార్చేందుకు అవసరమైన దృక్పథాన్ని అలవర్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. నా విద్యార్థి దశలో మేమంతా సామాజిక అంశాలు, ప్రజా సమస్యలపై లోతైన అవగాహనతో ఉండేవాళ్లం. ఆ వయసులోనే వాటిపై పనిచేయడం మాలో జాతీయ నిర్మాణ భావన ఒక రూపు సంతరించుకోవడానికి దోహదం చేసింది’ అని వివరించారు.
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ)లో శనివారం జరిగిన 37, 38వ స్నాతకోత్సవానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోపన్యాసం చేశారు. ఏఎన్‌యూ పూర్వ విద్యార్థి అయిన జస్టిస్ రమణను యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఛాన్స్‌లర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఏఎన్‌యూతో తన అనుబంధాన్ని జస్టిస్ రమణ గుర్తు చేసుకున్నారు. ఆంగ్లంలో ప్రసంగించిన రమణ.. యూనివర్సిటీలో తన విద్యాభ్యాసం, జ్ఞాపకాల్ని వివరించేటప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడారు.
"ఇదే వర్సిటీలో నేను కూడా చదివా. యూనివర్సిటీతో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. మేము చదివేటప్పుడు వర్సిటీలో ఇన్ని గదులు లేవు. క్లాస్‌రూమ్‌ల కంటే క్యాంటీన్‌లోనే ఎక్కువ ఉండేవాళ్లం. గంటల తరబడి క్యాంటీన్‌లో చాలా విషయాలపై చర్చించేవాళ్లం. సమాజంలోని అనేక సమస్యలపై చర్చ జరిపేవాళ్లం. విద్యార్థి సంఘాల సమావేశంలో పలు అంశాలపై చర్చించేవాళ్లం. ప్రజా సమస్యలపై అవగాహన కలిగి.. వాటికి పరిష్కారం చూపగలగాలి." - సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
పనిమంతుల కర్మాగారాల్లా వృత్తి విద్యా కోర్సులు
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏర్పాటు చేసిన వృత్తి విద్యా సంస్థల్లో అన్ని వర్గాలకూ సమాన అవకాశాలు కల్పించారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి అవి ఎంతగానో దోహదం చేశాయని సీజేఐ పేర్కొన్నారు. ‘ఆ సంస్థలు గొప్ప సామాజిక, ఆర్థిక మార్పునకు అద్భుతమైన వేదికలుగా నిలిచాయి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు మన వృత్తి విద్యా కోర్సులు విధేయులైన పనివారిని తయారు చేయడానికే పరిమితమవుతున్నాయి. ఎక్కువ వేతనాలు వచ్చే, లాభదాయకమైన ఉద్యోగాలు సాధించడమే వాటి లక్ష్యంగా మారిపోయింది. చరిత్ర, ఆర్థిక, సామాన్య శాస్త్రాలు, భాషా శాస్త్రాలు, ఇతర సామాజికశాస్త్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రొఫెషనల్ యూనివర్సిటీలకు వెళ్లిన తర్వాత కూడా విద్యార్థులు తరగతి గదికే పరిమితమవుతున్నారు తప్ప ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదన్నది కటువైన వాస్తవం’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘విద్య ప్రాథమిక లక్ష్యం కేవలం వ్యక్తిగత వికాసమా? సామాజిక అభ్యున్నతా? అన్నది తరచూ ఎదురయ్యే ప్రశ్న. సంపూర్ణ విద్య ఈ రెండు ప్రయోజనాల్ని సమతుల్యం చేస్తుంది’ అని పేర్కొన్నారు.
దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి: గవర్నర్
దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలపాలన్న తపన ప్రతి విద్యార్థిలోనూ ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. ‘మౌలిక వసతులు, పరిశ్రమలు, ఆరోగ్య, విద్య, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ రంగాల్లో మనం ఎంతో అభివృద్ధి చెందాం. ఈ దేశ యువతలో అంతులేని శక్తి, సృజనాత్మకత, పురోగామి ఆలోచనలు ఉన్నాయి. దేశ జనాభాలో యువతే ఎక్కువ. కానీ మన దేశం ఇప్పటికీ ఎందుకు అగ్రదేశం కాలేకపోతుంది? మీరు చేస్తున్న పనికీ, మీరు సాధించగల దానికీ పొంతన లేకపోవడమే దీనికి కారణం. మీ దృష్టిని, పరిధిని దేశం కోసం విస్తృతపరుచుకోండి. బలమైన భారతదేశాన్ని ఆవిష్కరించేందుకు దోహదపడండి. ఏఎన్‌యూలో ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన సామర్థ్యాలున్నాయని నమ్ముతున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీ పురోభివృద్ధికి అవి దోహదం చేస్తాయి. వైఫల్యాలకు కుంగిపోవద్దు. ప్రయత్నం ఆపొద్దు. కలల్ని సాకారం చేసుకోండి. చర్చించండి.. విభేదించండి.. కానీ ఆచరణలోకి దిగినప్పుడు మాత్రం దేశాన్ని ముందుంచాలన్న దృష్టితోనే పనిచేయండి. జీవితంలో సవాళ్లు, అవకాశాలు ఒకేలా ఉంటాయి. ప్రతి సవాలునూ అవకాశంగా ఎలా మార్చుకున్నారన్నదానిపైనే మీ విజయం ఆధారపడి ఉంటుంది’ అని గవర్నర్ ఉద్బోధించారు.
గౌరవ డాక్టరేట్ అందుకున్న జస్టిస్ ఎన్.వి.రమణకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి వీసీ పి.రాజశేఖర్, రాష్ట్ర ప్రభుత్వ, యూనివర్సిటీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్‌డీ పట్టాలను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
యువతలో సామాజిక స్పృహ రావాలి: జస్టిస్ ఎన్వీ రమణ
‘ఇక్కడ యూనివర్సిటీని ప్రారంభించడానికి ముందు గుంటూరులో పీజీ సెంటర్‌గా ఉండేది. అప్పట్లో అక్కడి ఉద్యోగులు చాలా సమస్యల్లో ఉండేవారు. డిగ్రీ కాలేజీ విద్యార్థిగా వాళ్ల అసోసియేషన్‌కు చేదోడు వాదోడుగా ఉండేవాణ్ని. బీఎస్సీ పూర్తయ్యాక పాత్రికేయుడిగానో, మరో వృత్తిలోనో స్థిరపడదామనుకుంటున్నప్పుడు.. ఉద్యోగులంతా మా ఇంటి ముందు ధర్నా చేసి, నన్ను యూనివర్సిటీ లా కాలేజీలో చేరాలని పట్టుబట్టారు. అలా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివి ఈ స్థాయికి వచ్చాను. యూనివర్సిటీలో ఎన్నో మధురస్మృతులున్నాయి. అప్పట్లో ఇన్ని భవనాలు, ఇంత మంది సిబ్బంది లేరు. రెండు రేకుల షెడ్లు, ఒక క్యాంటీన్‌షెడ్ ఉండేవి. క్యాంటీనే మా అడ్డా. సమాజంలోని అనేక సమస్యలపై గంటల తరబడి చర్చలు జరిగేవి. మా నుంచి మిగతా విభాగాల విద్యార్థులు స్ఫూర్తి పొందేవారు. ఒక దశలో న్యాయశాస్త్ర విద్యార్థులు.. మిగతా విద్యార్థులను చెడగొడుతున్నారని, వాళ్లలో అవసరమైనదానికంటే తెలివి ఎక్కువైపోతోందని మిగతా విభాగాలన్నీ అనుకున్నాయి. న్యాయ కళాశాలను ఇక్కడి నుంచి పంపించేయాలని ఆలోచించాయి’ అని జస్టిస్ ఎన్.వి.రమణ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఆ రోజుల్లో విద్యార్థుల్లో ఉన్న చైతన్యం, సామాజిక స్పృహ ఇప్పుడు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. ‘నాలుగు దశాబ్దాల క్రితం నేను ఈ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు.. మేం తరగతి గదులకు మాత్రమే పరిమితమయ్యేవాళ్లం కాదు. సిద్ధాంతాలు, భావజాలాలు, రాజకీయాలు, సామాజిక అంశాలపై విస్తృతంగా చర్చించుకునేవాళ్లం. మేం చేసిన చర్చలు, పెంచుకున్న అవగాహన.. ప్రపంచంపై మా దృష్టి కోణం ఒక రూపం సంతరించుకునేందుకు, పరివర్తనకు దోహదం చేశాయి. సమాజం, రాజకీయాల గతిని మార్చడంలో ఒక వ్యక్తి మాటకు, అభిప్రాయానికి ఉన్న విలువేంటో అది మాకు నేర్పించింది. అప్పట్లో అది స్టూడెంట్ ఫెడరేషనా, పీడీఎస్‌యూనా, ఏబీవీపీనా, ఆర్‌ఎస్‌యూనా, కాంగ్రెసా, కమ్యూనిస్టులా అని చూసేవాళ్లం కాదు. యూనివర్సిటీలో ఎవరు సమావేశం పెట్టినా వెళ్లి, చర్చల్లో పాల్గొనేవాళ్లం. విద్యార్థి సంఘాలకు సంబంధించి అలాంటి సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నట్లు లేదు. సమస్యలపై యువతరం చర్చించకపోతే, స్పందించకపోతే దేశ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి. మీరంతా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై బాధ్యతతో వ్యవహరిస్తూ, ఆదర్శప్రాయంగా నిలవాలి’ అని విద్యార్థులకు జస్టిస్ ఎన్.వి.రమణ ఉద్బోధించారు.
విద్యా సంస్థలా, ఫ్యాక్టరీలా?
‘ఇప్పటి తరం ఎలాంటి విద్యా విధానానికి ప్రాధాన్యం ఇస్తుందో గమనిస్తున్నాను. విద్యా సంస్థలు తమ సామాజిక ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయా అనిపిస్తోంది. విద్యా కర్మాగారాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి చదువుల్లో నాణ్యత తగ్గుతోంది. దీనికి ఎవర్ని తప్పు పట్టాలో అర్థమవడం లేదు. నిజమైన విద్య.. ప్రతి వ్యక్తీ సమాజంలోని మూలాల్లోకి వెళ్లి సమస్యల్ని గుర్తించి, వాటికి పరిష్కారాలు కనుగొనే నైపుణ్యాల్ని అలవర్చాలి. వినూత్న ఆలోచనలు, అద్భుతమైన పరిశోధనలు, ఆవిష్కరణలకు యూనివర్సిటీలు కేంద్రాలుగా మారాలి. వాటికి నిధుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది’ అని జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. ఆర్థిక ప్రయోజనాల్నే దృష్టిలో పెట్టుకుని, సాంస్కృతిక, పర్యావరణ బాధ్యతను విస్మరించడం తగదన్నారు. ‘మీరంతా మార్పునకు మార్గదర్శులన్న విషయం గుర్తుపెట్టుకోండి. సుస్థిరాభివృద్ధి నమూనాల గురించి ఆలోచించండి. మీ సంస్కృతి, భాష నుంచి స్ఫూర్తి పొంది, భవిష్యత్ లక్ష్యాలు, దార్శనికతలో వాటికి చోటు కల్పించండి. సమాజాన్ని మీతోపాటు తీసుకెళ్లండి. ‘సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడుపడవోయ్.. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..’ అన్న మహాకవి గురజాడ మాటల్ని ఎప్పుడూ ఆచరిస్తే హింస, ఘర్షణల్లేని మెరుగైన సమాజాన్ని చూడగలం’ అని జస్టిస్ రమణ యువతకు ఉద్బోధించారు.
ఇవీ చదవండి: