Bypass road: ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం విజయవాడకు బైపాస్ రోడ్డు నిర్మించాలని 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గామన్ ఇండియా సంస్థ టెండర్ దక్కించుకుంది. కానీ డీపీఆర్‌లో జాప్యంతో పనులు మొదలు కాలేదు. బైపాస్ నిర్మించాలనుకున్న ప్రాంతం 2016లో సీఆర్డీఏ పరిధిలోకి వచ్చింది. అమరావతి బృహత్ ప్రణాళికకు అనుగుణంగా అలైన్‌మెంట్ మార్చారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మించి దానికి అనుసంధానంగా బైపాస్ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం సూచించగా.. కాంట్రాక్ట్ సంస్థ అందుకు అంగీకరించలేదు.
పనుల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో.. బైపాస్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు కోర్టుకు వెళ్లారు. భూసేకరణ కింద పరిహారం తక్కువగా వచ్చిందని.. భూ సమీకరణ ప్రకారం రాజధానిలో ప్లాట్లు కేటాయించాలని అన్నదాతలు కోరారు. కోర్టు వారి పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతోపాటు వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ సంస్థల్ని మార్చివేయడంతో రాజధాని రైతులకు కష్టాలు రెట్టింపయ్యాయి.
గుంటూరు జిల్లా చినకాకాని నుంచి విజయవాడ శివార్లలోని గొల్లపూడి వరకు బైపాస్ నిర్మాణ పనుల్ని అదానీ, నవయుగ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి నిర్మించాల్సి ఉంది. పనుల్లో భాగంగా కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు. 1132 కోట్ల రూపాయల అంచనాతో కేంద్రం ఈ పనులకు ఆమోదం తెలిపింది. నిధులు త్వరగా మంజూరు చేయాలని రాజధాని రైతులు ఇటీవల దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు. వెంకటపాలెంలో తాము భూములిచ్చిన ప్రాంతంలో బైపాస్ నిర్మించలేదు కాబట్టి వాటిని భూ సమీకరణలో తీసుకుని.. అందుకు బదులుగా ప్లాట్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
" నేషనల్ హైవే సంస్థ మాకు చాలా అన్యాయం చేస్తోంది. భూములు తీసుకునేటప్పుడు అవి ఎలాంటివి? వీటి ద్వారా రైతులకు ఎంత ఆదాయం వస్తోంది..? భూములు తీసుకుంటే రైతులకు ఎంత అన్యాయం జరుగుతుంది? ఆ భూముల మార్కెట్ విలువ ఎంత? ఇలా.. వేటినీ పరిగణనలోకి తీసుకోకుండా మా భూములు తీసేసుకున్నారు. మా భూములు వాళ్ల స్వాధీనంలోకి వెళ్లాయని చెబుతూ.. 10 లక్షలో 20 లక్షలో సాంక్షన్ చేశామని చెబుతూ.. మాకు తీరని అన్యాయం చేస్తున్నారు. తీసుకున్న భూములకు మాకు ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారు? భూమికి భూమి ఏ విధంగా కేటాయిస్తారు? మాకు ఎలా న్యాయం చేస్తారు? అని ప్రభుత్వాలను అడుగుతున్నాం." - రైతులు
గొల్లపూడి నుంచి గన్నవరం మండలం చినఅవుటపల్లి వరకు నిర్మాణ పనులను వేరే సంస్థ చేజిక్కించుకుంది. ఇప్పటి వరకు 15 శాతం పనులు పూర్తయ్యాయి. గన్నవరంలో భూసేకరణ మొత్తం పూర్తికాగా.. 2023లోగా పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. విజయవాడ గ్రామీణ మండలంలోని జక్కంపూడి వద్ద భూసేకరణ సమస్య తలెత్తడంతో పనులు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: POWER CUT: అప్రకటిత విద్యుత్ కోతలు.. జనాలు గగ్గోలు