రాష్ట్రంలో మిర్చి క్రయవిక్రయాలకు గుంటూరు మార్కెట్ యార్డు పేరుగాంచింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు ఇక్కడకు మిరప పంట తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. కరోనా ప్రభావం ఎక్కువ కావడంతో ముందుగానే మిర్చి యార్డుకు జూన్ 6 వరకు సెలవులు ప్రకటించారు. ఈనెల 1వ తేది నుంచి యార్డులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే చాలాచోట్ల పొలాల్లో, కల్లాల్లో ఇంకా మిర్చి మిగిలే ఉంది. రైతులు పంట అమ్మేందుకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గోదాముల వద్ద కొనుగోళ్లకు అధికారులు అనుమతించారు.
పోటీ లేక పడిపోయిన మిర్చి ధరలు..
రైతులు పంట తీసుకుని వ్యాపారులకు సంబంధించిన గోదాముల వద్దకు వెళ్లి నేరుగా విక్రయిస్తున్నారు. గోదాముల వద్ద ఒకరిద్దరు మాత్రమే వ్యాపారులుంటారు. వాళ్లు చెప్పిందే రేటు, ఇచ్చిందే ధర అవుతోంది. మార్కెట్ యార్డులో అయితే.. వందలాది మంది వ్యాపారులు ఉంటారు. బిడ్డింగులో పోటీ ఉంటుంది కాబట్టి మంచి ధర లభిస్తుంది. ఇపుడు రైతులు బయటే పంట అమ్ముకోవాల్సి రావటం ధరలపై ప్రభావం చూపింది. తేజ రకం మిర్చి సాధారణంగా క్వింటాకు రూ. 14 వేలకు పైగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం అది రూ. 12 వేలలోపే పలుకుతోంది. మిగతా రకాలు కూడా 2 నుంచి 3 వేల రూపాయల మేర ధరలు పడిపోయాయి. రైతులు చాలా దూరం నుంచి పంట తీసుకువస్తుంటారు. వారు మూడు, నాలుగు గోదాముల వద్దకు వెళ్లి అక్కడి ధర విచారించి అమ్ముకునే పరిస్థితి లేదు. ఎంతోకొంతకు పంట అమ్ముకుని వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ ఏడాది దిగుబడి కూడా తగ్గిందని.. ఇపుడు ధరలు పడిపోవటంతో నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యతను బట్టి ధరలు ఉంటాయంటున్న వ్యాపారులు..
మార్కెట్ యార్డు బయట జరిగే వ్యాపారంపై అధికారులకు నియంత్రణ ఉండటం లేదు. కేవలం యార్డుకు రావాల్సిన పన్ను వస్తే చాలనే భావనలో అధికారులు ఉన్నారు. ఈ పరిణామాన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ధరలు తగ్గించి కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. మిర్చియార్డుకు సెలవులు ఇచ్చారని.. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు, పాలకమండలి కోరినందున గోదాముల వద్ద కొనుగోళ్లు చేస్తున్నట్లు తెలిపారు. పైగా మార్కెట్ యార్డులో కరోనా ప్రబలి కొందరు మరణించటంతో అక్కడ లావాదేవీలు నిర్వహించే పరిస్థితి లేదంటున్నారు. ఆన్ లైన్ బిడ్డింగ్ నిర్వహించి మార్కెట్కు వెళ్లాల్సిన పన్ను చెల్లింపును సక్రమంగా చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. కాయల నాణ్యతను బట్టి ధర ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. బయట జరిగే వ్యాపారాల పైనా తమ పర్యవేక్షణ ఉంటుందని మిర్చియార్డు అధికారులు చెబుతున్నారు. మిర్చి కోతలు చివరి దశకు చేరినందున నాణ్యత తగ్గి ధరలు పడిపోయినట్లు యార్డు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
దూర ప్రాంతాల నుంచి అమ్మకానికి రాలేక..
కరోనా కేసులు పెరిగిన దృష్ట్యా కర్ఫ్యూ కూడా అమల్లోకి వచ్చిన తరుణంలో రైతులు దూర ప్రాంతాల నుంచి వచ్చి మిర్చి విక్రయించటం కూడా ఇబ్బందిగా మారే అవకాశముంది.
ఇవీ చదవండి: