Ganja Seized In Guntur: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేయారు. వారి నుంచి 50 కిలోల సరుకును స్వాధీనం చేసున్నారు. దీని విలువ రూ. 36 లక్షల 59 వేలకుపైగా ఉంటుందని అంచనా వేశారు. నిందితుల నుంచి లిక్విడ్ గంజాయి బాటిళ్లను, రెండు కార్లను సీజ్ చేశారు అధికారులు.
ఈ కేసులో నిందితులు వినయ్ కుమార్, కుర్రా వెంకటేష్, ఇసాక్ వామన్, మహమ్మద్ ఇషన్, బొంతా నితిన్ అనే ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు. మరో నిందితుడు అక్బర్ పరారీలో ఉన్నారని తెలిపిన ఎస్పీ.. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఇలా దొరికారు..
గుంటూరు లాలాపేటకి చెందిన సిద్దా బత్తుల వినయ్ కుమార్ అనే యువకుడు బీ.టెక్ పూర్తిచేసి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. దీంతో గంజాయి ముఠాతో సంబంధాలు పెంచుకున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తుండగా.. గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న సమయంలో వినయ్‌కు ఇతర రాష్ట్రాల గంజాయి ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు బీబీఏ చదువుతున్న ఓ యువకుడితో పరిచయం పెంచుకున్నాడు. ఆ కుర్రాడితో లిక్విడ్ గంజాయిని విక్రయించడం ప్రారంభించాడు.
తాజాగా.. వినయ్‌కు జైలులో పరిచమైన వ్యక్తుల నుంచి గంజాయి కావాలని సమాచారం అందింది. దీంతో 10 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు. అనుకున్న విధంగా గంజాయి సరఫరా చేయడానికి అన్నీ సిద్ధంగా చేసుకున్నాడు. కేరళ, కర్ణాటకకు చెందిన ఇసాక్ వామన్ జోర్, మహమ్మద్ ఇషాన్ ముందస్తుగా.. సరుకు ఉందో లేదో తనిఖీ చేయమని అక్బర్ అనే వ్యక్తిని కేరళ నుంచి గుంటూరు పంపించారు. గుంటూరులో మూడు రోజుల పాటు బసచేసి అన్నీ సరిగానే ఉన్నాయని భావించి కేరళలో ఉన్న వారికి సమాచారం అందించాడు. దీంతో.. వారు సరుకు తీసుకువెళ్ళడానికి కారు వేసుకుని వచ్చారు. పథకం ప్రకారమే.. కారులో గంజాయి ఎక్కుంచుకుని గుంటూరు కృష్ణబాబు కాలనీ నుంచి లాల్ పురం రోడ్డులో వెళ్తుండగా పోలీసులు దాడిచేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన వినయ్ కుమార్ పైన గతంలో రెండు కేసులు ఉన్నాయని, అతని పైన పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు అర్బన్ ఎస్పీ చెప్పారు. శాంతిభదత్రలపైన నిరంతర నిఘా ఉంటుందని.. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చెడ్డీ గ్యాంగ్‌ల పై కూడా ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ తెలిపారు.
ఇదీ చూడండి: