గుంటూరులో సంచలనం రేపిన విద్యార్థిని రమ్య హత్యకు కారణమైన నిందితుడిని దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్షించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. లేకుంటే బాధిత కుటుంబం తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
ఒక్కో వర్గానికి ఒక్కోలా పరిహారం..
బీటెక్ ఆఖరి చదువుతున్న విద్యార్థిని రమ్య హత్య అత్యంత దారుణమని.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. వైకాపా ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు, దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు మొక్కుబడిగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఇచ్చే పరిహారంలో కూడా రాజకీయం చేస్తున్నారని.. ఒక్కో సామాజిక వర్గానికి ఒక్కోలా పరిహారం అందిస్తున్నారని మండిపడ్డారు.
నిందితుడికి ఉరిశిక్ష పడాల్సిందే..
నిందితుడికి ఉరిశిక్ష వేసి.. సీఎం జగన్ న్యాయం చేస్తారని బాధిత కుటుంబం ఆశగా చూస్తోందని వెల్లడించారు. వారి నమ్మకం ప్రకారం 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దిశ చట్టం లేక పోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోందన్నారు. 21 రోజుల్లో నిందితుడికి శిక్ష పడకపోతే.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతుందని ప్రకటించారు. సెప్టెంబర్ 24 లోపు దిశ చట్టం ప్రకారం ఎంతమందికి శిక్షలు విధించారో, ఎంత పరిహారం ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో సెప్టెంబర్ 25న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు ముందే నిలదీస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి అన్నారు.
ఇదీ చదవండి: