తెలుగు వారి సంస్కృతి, భాషా వారసత్వ సంపదకు పుస్తక రూపమే పెద్ద బాలశిక్ష. మరే భాషల్లోనూ ఈ తరహా పుస్తకం లేకపోవడం దీని ప్రత్యేకతకు నిదర్శనం. దేవతామూర్తుల ప్రార్ధనలు, అక్షరాలు, తెలుగు గుణింతాలు, అక్షరాలతో మాటలు, తెలుగు అంకెలు, దండకాలు, ఎక్కాలు, లెక్కలు, పంచాంగ విషయాల గురించి పెద్దబాలశిక్షలో విపులంగా ఉంటుంది. నీతిపద్యాలు, నీతి కథలు, పిల్లలకు బుద్ధులు నేర్పే పాటలు, గేయాల రూపంలో ఆరోగ్య సూక్తులు, హితోక్తులు, భూగోళ, ఖగోళ, విజ్ఞాన, ఆరోగ్య విషయాల కలబోత పెద్ద బాలశిక్ష.
ఎస్పీబీ ప్రసంగంతో స్ఫూర్తి...
ఆధునిక విద్యావిధానం వల్ల కనుమరుగైన పెద్ద బాలశిక్షకు మెరుగులుదిద్ది మళ్లీ తెలుగు లోగిళ్లకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు...గాజుల సత్యనారాయణ. పుస్తక దుకాణంలో గుమస్తాగా చిరుద్యోగం చేస్తూనే..అత్యున్నత సంకల్పంతో పెద్ద బాలశిక్షను సరికొత్త రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. 1990 విజయవాడ పుస్తక మహోత్సవంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రసంగంతో స్ఫూర్తి పొందిన గాజుల సత్యనారాయణ...నేటి తరానికి అనుగుణంగా పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు.
పన్నెండేళ్ల కష్టం..
దాదాపు 12 ఏళ్లు కష్టపడి 116 రూపాయలకే పెద్ద బాలశిక్షను మార్కెట్లోకి తీసుకువచ్చారు. తెలుగులో అత్యధికంగా అమ్ముడైన పుస్తకాల్లో ఒకటిగా పెద్ద బాలశిక్షను నిలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, ఇంగ్లండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలకు సైతం సరఫరా చేస్తున్నారు.
కానుకగా పెద్దబాలశిక్ష...
పుస్తక ముద్రణలోనూ గాజుల సత్యనారాయణ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. వేడుక ఏదైనా పెద్ద బాలశిక్ష కానుకగా ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టారు. నామకరణం, పుట్టినరోజు, పుష్పాలంకరణ, పెళ్లిళ్లు, చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఇలా వివిధ కార్యక్రమాలకు ఈ పుస్తకం కానుకగా ఇచ్చే సంప్రదాయాన్ని అలవాటు చేశారు.
సరికొత్తగా తాళపత్ర గ్రంథాలు...
చిన్నారుల్ని ఆకర్షించేలా కొత్తగా తాళపత్ర గ్రంథాల తరహాలో వేమన, సుమతీ శతకాలు, భగవద్గీత శ్లోకాలను ముద్రించారు. గాజుల సత్యనారాయణ ఈ నూతన ప్రయత్నానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రశంసలు సైతం దక్కాయి.
ఇవీచదవండి.