వైకాపా ప్రభుత్వం మూడు రాజధానులను తెరమీదకు తెచ్చి.. రాష్ట్రాభివృద్ధిని కుంటుపరిచిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు(CPM RAGHAVULU ON AMARAVATI) ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ నేతలతో రాఘవులు సమావేశమయ్యారు. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్ర మహాసభల నిర్వహణపై చర్చించారు. రాజధాని అమరావతికి సీపీఎం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాజధాని సకాలంలో పూర్తి కాకపోవడానికి తెలుగుదేశం పార్టీనే కారణమని అన్నారు.
రాజధాని నిర్మాణం కోసం 1500 ఎకరాలు సరిపోతుందని రాఘవులు అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు రద్దుపై చూపించిన శ్రద్ధ.. పరిపాలన మీద చూపించాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనవిభాగాలు అమరావతిలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. శాసన సభలో వైకాపా సభ్యులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. మహిళలపై అనుచితంగా మాట్లాడినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుపై తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం కాదని.. కనీస మద్దతు ధర లభించేలా పార్లమెంటులో చట్టం చేయాలని ప్రధాని మోదీకి ఈ సందర్భంగా సూచించారు.
ఇదీ చదవండి:
Live video: నడిరోడ్డుపై సంచలనం.. రాడ్లు, జాకీలతో వ్యక్తిపై దాడి..!