గుంటూరు జీజీహెచ్ వంటి ఆస్పత్రుల్లో పడకలు లభించక సామాన్య ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొందరు రోగులు ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయించుకుని చేరాల్సిన పరిస్థితి. మరోవైపు ఆక్సిజన్ పరిస్థితి దినదినగండంగా మారింది. సామర్ధ్యానికి మించిన పడకలతో పెద్దాస్పత్రి రద్దీగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు కరవై ప్రైవేటు వైద్యానికి పరుగులు పెడుతున్నారు. ట్రైఏజ్ సెంటర్లతో వడపోత ప్రస్తుతం చాలామంది రోగులు 104కి ఫోన్ కాల్స్ చేస్తున్నారు. రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లాకు ఇవి చేరుతున్నాయి. ఆలస్యమైనప్పటికీ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చే వినతులు కొంతమేరకు 104 సిబ్బంది పరిష్కరించగలుగుతున్నారు.
పడకల విషయానికి వచ్చేసరికి పెండెన్సీ పెరిగిపోతోంది. 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేశాక ఆస్పత్రులు లేదా తీవ్రత తక్కువ ఉంటే కరోనా కేర్ సెంటర్లలో రోగులకు పడక లభించేంతవరకు కాల్ పరిష్కారమైనట్లు కాదు. కొవిడ్ డ్యాష్ బోర్డులో చూపిస్తున్న పడకల ఖాళీలకు, క్షేత్రస్థాయిలో ఆస్పత్రుల్లో ఉన్న పడకలకు పొంతన ఉండటం లేదు. ఎక్కడా పడక లేదనే ఆందోళనే వ్యక్తమవుతుంది. 104 కాల్ సెంటర్ ద్వారా వెళ్లే ఫిర్యాదుదారునికి పడక లభించకపోతే... ఆ టిక్కెట్ పరిష్కారమైనట్లు కాదు. దీంతో 104 కాల్ సెంటర్‌కు వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువగా పడకలు, ఆక్సిజన్, రెమిడెసివర్ కోసం వినతులు పెద్దఎత్తున పెండింగ్ లో ఉంటున్నాయి.
క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించిన అధికారులు... రోగుల లక్షణాలను బట్టి ఎక్కడికి పంపాలనే విషయంలో ట్రైఏజ్ కేంద్రాల ప్రాముఖ్యతను నిర్ణయిస్తున్నారు. ట్రై ఏజ్ సెంటర్ల ద్వారా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన రోగులను ముందుగానే వారి లక్షణాలను వైద్యులు గుర్తిస్తారు. తక్కువ లక్షణాలుంటే హోం ఐసోలేషన్‌కు పంపిస్తారు. మధ్యస్థ లక్షణాలైతే కొవిడ్ కేర్ సెంటర్, ఆయాసంతో ఆక్సిజన్ అవసరమైనవారు, లక్షణాలు తీవ్రంగా ఉంటే ఆస్పత్రులకు సిఫార్సు చేయనున్నారు.
దీనివల్ల రోగుల లక్షణాల బట్టి వైద్యం అందే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో మొదటి విడతలో ట్రై ఏజ్ కేంద్రాలను బాగానే నిర్వహించారు. రెండో విడతలో వీటికి అంత ప్రాధాన్యమివ్వలేదు. రోజు రోజుకి కరోనా కేసులు ఉద్ధృతం కావడం, పరీక్షలు జాప్యం కావడం, పడకలు, ఆక్సిజన్‌కు కొరత ఏర్పడటంతో నియోజకవర్గానికో ట్రై ఏజ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులపై భారాన్ని తగ్గించేలా ఆయా ప్రాంతాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 30 పడకలు ఏర్పాటు చేసి కొవిడ్ చికిత్స కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇదీ చదవండి: