గుంటూరు జిల్లాలో కొవిడ్ ప్రభావం జులైతో పోలిస్తే ఆగస్టులో కొంచెం తగ్గుముఖం పట్టినా... కేసుల పరంగా మాత్రం ముందు వరుసలోనే ఉంది. జిల్లాలో గురువారం కొత్తగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 30వేల 427 కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 69 ఉన్నాయి. ఇక జిల్లాలోని తెనాలి 49, మాచర్ల 42, పెదకాకాని 41, దుర్గి 34, నరసరావుపేట 29, పిడుగురాళ్ల 22, తాడేపల్లి 15, వినుకొండ 14 అమరావతిలో 10 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మిగతా మండలాల్లో 156 కేసులు వచ్చాయని బులిటెన్ విడుదల చేశారు.
ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 21 వేల 12మంది ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో ఇవాళ కొత్తగా 6 మరణాలు సంభవించాయి. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 319కు చేరుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు గుంటూరు జిల్లాలోనే నమోదయ్యాయి. ఒక్క గుంటూరు జీజీహెచ్ లోనే 264మంది మరణించారు. అయితే పరిస్థితి విషమించిన తర్వాత ఆసుపత్రికి రావడంతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
కొవిడ్ రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రస్తుతం ఉన్న 50 ఐసీయూ పడకలకు అదనంగా మరో 50 సిద్ధం చేస్తున్నట్లు సూపరింటెండెంట్ సుధాకర్ తెలిపారు. నాన్ ఐసీయూ వార్డుల్లోని 550 బెడ్లకు కూడా ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారి కోసం 140 వెంటిలేటర్లు ఉన్నాయని తెలిపారు.
వైరస్ ఉద్ధృతిని నియంత్రించటంతో పాటు కొవిడ్ రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించటంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని... ఏ మాత్రం అసౌకర్యంగా ఉన్నా ఆసుపత్రికి వెళ్లాలని అధికారులు చెబుతున్నారు. ఇక కరోనాతో ఆసుపత్రుల్లో చేరిన రోగుల పరిస్థితి చూసేందుకు అన్ని ఆసుపత్రుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. రోగి కుటుంబ సభ్యులు వారి యోగక్షేమాలు తెలుసుకోవచ్చన్నారు. జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగానే ఉన్నాయని.. అయితే దేశ సగటుతో పోలీస్తే ఇది తక్కువని చెబుతున్నారు అధికారులు.
గతంలో కొవిడ్ మృతదేహాలు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ముందుకు రాని పరిస్థితి ఉండేది. ఇపుడు చాలా మంది పార్థివదేహాలు తీసుకెళ్తున్నారు. పీపీఈ కిట్లు వంటి జాగ్రత్తలు తీసుకుని అంత్యక్రియలు చేయవచ్చని అధికారులు అవగాహన కల్పించగా ఈ మార్పు వచ్చింది.
ఇదీ చదవండి: