అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. అమరావతి పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వరంలో ఈనెల 20న ఉద్దండరాయునిపాలెంలో భారీ సదస్సు నిర్వహిస్తున్నామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోందన్నారు.
గుంటూరులో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరావతి పరిరక్షణ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని భూములు ఇచ్చిన రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. తెదేపా, జనసేన పార్టీ నేతలు రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారే తప్ప.. శిబిరాలలో పర్యటించి ఎన్నడూ ప్రత్యేక్ష పోరాటం చేయలేదన్నారు. వైకాపా, జనసేన, తెదేపా పార్టీలు ప్రధాని నరేంద్రమోదీ కనుసైగలలో పని చేస్తున్నాయని ఆరోపించారు. ఈనెల 20న మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
అమరావతిని రక్షించుకోవటంతో పాటు మోదీ వైఖరిని ఎండగడతామని మస్తాన్ వలి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి జరగాలంటే అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తెదేపా వైఫల్యం చెందిందని విమర్శించారు. రైతున్నలకు న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష ఉద్యమంలోకి వెళుతుందని తెలిపారు.
ఇవీ చదవండి..