విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి, నూతన ఆవిష్కరణల వైపు మళ్లించే లక్ష్యంతో.. నాగార్జున విశ్వవిద్యాలయం విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించింది. ఇంజినీరింగ్, సైన్స్ విభాగాల విద్యార్థులు తయారుచేసిన ఉపకరణాలు, కొత్త ఆవిష్కరణలకు ప్రదర్శనలో చోటు కల్పించింది. ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు తయారుచేసిన 'కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎలాంటి పిల్లర్లు లేకుండా కేబుల్ స్ట్రైయిడ్ స్ప్రింగ్‌తో రెండు కిలోమీటర్ల వరకు వంతెన నిర్మించడం దీని ప్రత్యేకత. అలాగే సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు... ప్రత్యేకమైన రహదారి ప్రాజెక్టు తయారుచేశారు.
రైలు బోగీలు ఊడిపోతే వెంటనే లోకోపైలట్‌ను అప్రమత్తం చేసి, ప్రమాదాలు నివారించేలా ఇంకో ప్రాజెక్టును తీర్చిదిద్దారు మరికొందరు విద్యార్థులు. పంటకు పట్టే చీడపీడల్ని గుర్తించి, మొబైల్ ఫోన్‌కు సమాచారం అందించే డ్రోన్ తయారుచేసి మెప్పించారు ఇంకొందరు విద్యార్థులు. పశుపక్షాదులు వచ్చినా వెంటనే అప్రమత్తం చేస్తుంది.
ఇక ప్రకృతి విపత్తల సమయంలో బాధితులను రక్షించే డ్రోన్ పరిజ్ఞానానికి రూపకల్పన చేయడం ఔరా అనిపిస్తోంది. ఫార్మా ప్రయోగాలకు సంబంధించి విద్యార్థుల నమూనాలను కూడా ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: 'సీఆర్‌డీఏ చట్టం ప్రకారం ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉంది'