కరోనా అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వసతుల కల్పనపైనా నిరంతరం సమీక్ష చేస్తున్నట్లు వివరించారు. మొత్తం 5,367 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించినట్లు తెలిపారు. వీటిల్లో 177 పాజిటివ్.. 5,190 నెగిటివ్ వచ్చాయని పేర్కొన్నారు. ప్రతి రెడ్‌జోన్‌లో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే ఎక్కువమంది ప్రత్యేక అధికారులను నియామకం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కొత్త మిషన్ ద్వారా గంటకు 100 టెస్టులు చొప్పున రోజుకు 1000 టెస్టులు చేసుకోవచ్చని చెప్పారు.
ఇళ్లల్లో ఉన్నట్లుగానే క్వారంటైన్‌లో వసతులు ఉండాలని అధికారులను ఆదేశించినట్లు ఆళ్ల నాని తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న వారి నుంచి ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించాలని ఆదేశించామన్నారు. ఒక చిన్న ప్రాంతంలోనే దాదాపు 70 కేసులు ఉన్న జోన్‌లు కూడా ఉన్నాయని.. తెలిపారు. సిబ్బందికి పీపీఈ కిట్ల కొరత రాకుండా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. 227 వెంటిలేటర్లను సిద్ధంగా ఉన్నాయని... మరో 2 వేల వెంటిలేటర్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములై ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: