‘రాష్ట్రంలో 70-75 శాతం మంది కౌలు రైతులే. వారికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటివేవి రాయితీపై అందడం లేదు. రుణాలు దక్కడం లేదు. ఫలితంగా నిత్యం ఎక్కడో చోట రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏటా వేల మంది ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దేశవ్యాప్తంగానూ ఇలాంటి పరిస్థితే ఉంది’ అని అఖిలభారత కిసాన్‌సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని.. మిర్చికి తెగుళ్లు సోకి 80-90 శాతం మేర పంట దెబ్బతిందని వివరించారు.
అకాలవర్షాలతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుంచి రైతులకు ఎలాంటి సాయమూ లేదని ధ్వజమెత్తారు. ‘వ్యవసాయ రంగ సంక్షోభం- పరిష్కార మార్గాలు’ అంశంపై విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో మంగళవారం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై ధావలే మాట్లాడారు. ఏపీలోనూ వరికి మద్దతు ధర దక్కడం లేదని వివరించారు. గుంటూరు జిల్లాలో పర్యటన సందర్భంగా రైతులతో తాను మాట్లాడినప్పుడు.. ధాన్యం బాగుంటే క్వింటా రూ.1,400, వర్షానికి దెబ్బతింటే క్వింటా రూ.1,100 మాత్రమే లభిస్తోందంటూ వివరించారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల్లో కల్పిస్తామని చెప్పిన సదుపాయాల్లో 90శాతం ఇప్పటికీ లేవని వివరించారు.
ఇదీ చదవండి: ఆర్థికవేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి దర్పణం: చంద్రబాబు