గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కిరాణా దుకాణం నడుపుతున్న భార్యాభర్తలకు మూడ్రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించిన కారణంగా నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దంపతులిద్దరికీ కరోనా సోకిందని ప్రభుత్వ వైద్యులు నిర్ధారించారు.
మహిళకు అత్యవసర చికిత్స అందించారు. ఆమె పరిస్థితి క్షీణిస్తుండగా.. ఆసుపత్రి అధికారులు గుంటూరు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే మహిళ మృతి చెందింది. ఈ క్రమంలో అంబులెన్స్ సిబ్బంది మృతదేహాన్ని తిరిగి నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మృతదేహాన్ని బంధువులకు ఇవ్వకుండా అధికారులే ఖననం చేస్తామని చెప్పినట్లుగా తెలిసింది.
ఫేస్బుక్లో పోస్టు
కరోనా బాధితులైన తన తల్లిదండ్రులకు సరైన వైద్యం అందడం లేదని దంపతుల కుమారుడు వారి బాధను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. తన తల్లి ఆక్సిజన్ అందక విలవిల్లాడిపోతోందని.. తన తండ్రికి కనీసం బెడ్ కూడా ఏర్పాటు చేయలేదని వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను అధికారులకు చేరేలా సహకరించాలని కోరాడు. ఈ పోస్ట్ పలువురిని ఆవేదనకు గురి చేసింది. అయితే ఇంతలోనే పరిస్థితి విషమించి మహిళ ప్రాణాలు కోల్పోవడం.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అందరినీ కలిచివేసింది.
ఇదీ చూడండి:
కరోనా రోగుల అంబులెన్స్... ఎంతమంది ఎక్కడానికైనా ఉంది లైసెన్స్