ఓ బాలికపై కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. వారిని అడ్డుకున్న ఏఆర్ ఎస్సైపై దాడి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఈ ఘటన జరిగింది. ఏలూరు ఏటిగట్టు ప్రాంతానికి చెందిన ఓ బాలిక...తన ఇంటి సమీపంలోని కోర్టు వద్దకు వెళ్లగా.. అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు బాలికను వెంబడించారు. భయంతో ఇంటికి తిరిగివచ్చిన ఆమె...తమ ఇంటి పక్క వాటాలో ఉంటున్న ఏఆర్ ఎస్సై వెంకటేష్‌కు విషయం తెలిపింది. బాలికను వెంబడిస్తూ వచ్చిన యువకులు అక్కడికి చేరుకున్నారు. ఏఆర్ ఎస్సై యువకులను మందలించారు.
దీంతో ఆ యువకులు వెంకటేష్‌పై దాడి చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాలికతో కలిసి ఏఆర్ ఎస్సై సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. మరి కొందరితో పోలీసు స్టేషన్‌కు చేరుకున్న యువకులు... పోలీసు స్టేషన్ ఎదురుగా ఏఆర్ఎస్సై, బాలికపై దాడికి పాల్పడి, అసభ్యపదజాలంతో దూషించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో..యువకులు పరారయ్యారు.
తాము ఎమ్మెల్యే మనుషులమని ఆ యువకులు బెదిరింపులకు పాల్పడినట్లు ఏఆర్ ఎస్సై పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అప్రమత్తమైన పోలీసులు...దాడికి పాల్పడిన గడ్డం నాగేంద్ర, రాజేష్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి, మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ బాల రాజాజీ తెలిపారు.
ఇదీ చదవండి : తరగతుల నిర్వహణ, ఫీజుల నియంత్రణపై మార్గదర్శకాలు జారీ