వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనులను గాలికొదిలేసి పథకాల పంపిణీలో నిమగ్నమైందని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని ఏలూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. 16 నెలలుగా పట్టణంలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని అప్పలనాయుడు అన్నారు. తన నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థ సైతం అభివృద్ధి పనులు చేపట్టకుండా ప్రజాసౌకర్యాన్ని గాలికి వదిలేసిందన్నారు.
డ్రైనేజీ వ్యవస్థ విఫలమవటంతో పట్టణంలో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని.. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అప్పలనాయుడు మండిపడ్డారు. రోడ్లు, డ్రైనేజీలను పూర్తిగా అభివృద్ధిపరచాలని ఏలూరు కార్పొరేషన్ కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందించారు.