Illegal Excavations: వేసవి కారణంగా నీటి ప్రవాహం తగ్గడంతో కొల్లేరు అభయారణ్యంలో మళ్లీ అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం పెదయాగనమిల్లిలో దాదాపు 200 ఎకరాల్లో కొత్తగా చేపల చెరువులు తవ్వుతున్నారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి హస్తమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం కొల్లేరు అభయారణ్యంలో ఐదో కాంటూరు పరిధిలోపు చెరువులు తవ్వకూడదు. చేపల సాగుకూ అనుమతి లేదు. ప్రస్తుతం పనులు చేస్తున్న ప్రదేశం మూడు నుంచి ఐదో కాంటూరు పరిధిలోకి వస్తుందని తెలుస్తోంది. వారం రోజులుగా ఇక్కడ తవ్వకాలు సాగుతున్నా అటవీ, ఇతర విభాగాల అధికారులు స్పందించలేదు.
చూసీచూడనట్లుగా అధికారులు..
ఇటీవల కొల్లేరు వ్యాప్తంగా చాలాచోట్ల అభయారణ్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఏలూరు మండలం గుడివాకలంక, పత్తికోళ్లలంక ప్రాంతాల్లోనూ చెరువులు తవ్వుతుండగా, అటవీశాఖ అధికారి ఒకరు ఎకరానికి రూ.25 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తగా చెరువులు తవ్వుతున్న విషయం తెలిసీ పాత వాటి మరమ్మతులకు అవకాశం ఇస్తున్నామంటూ ముడుపుల వేటలో మునిగిపోయారు. 2004 తర్వాత సుప్రీంకోర్టు సాధికార కమిటీ కొల్లేరులో పర్యటించినప్పుడు ఆక్రమిత చెరువులను ధ్వంసం చేయాల్సిందేనని తీర్పు చెప్పింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే వేల ఎకరాలను అప్పట్లో ధ్వంసం చేశారు. మళ్లీ దాదాపు 15,700 ఎకరాల్లో ఆక్రమణలు ఏర్పడ్డాయని జిల్లా కలెక్టర్, జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదిక ఇచ్చారు.పెదయాగనమిల్లిలో చెరువు తవ్వకాలు చేయడం లేదని, కిందటేడాది తవ్విన చెరువునే మరమ్మతు చేస్తున్నారని అటవీశాఖ రేంజర్ కుమార్ తెలిపారు. గతేడాది పెదయాగనమిల్లిలో చెరువు తవ్వుతున్నట్లు సమాచారం వస్తే చర్యలు తీసుకున్నామని, ప్రస్తుత పరిస్థితిని విచారించి రేంజర్‌కు ఆదేశాలిస్తామని డీఎఫ్‌వో సెల్వంవెల్లడించారు.
ఇదీ చదవండి: Neet Exam: ఐదేళ్లలో 41.78 శాతం పెరిగిన నీట్-యూజీ పరీక్షల అభ్యరులు