ఆధునిక సాంకేతిక విప్లవంతో సమాజం ముందుకు వెళుతోంది. విభిన్న ప్రతిభావంతులకు మాత్రం.. ఈ సాంకేతికత అందని ద్రాక్షగా మిగులుతోంది. ఎన్నిరకాల వస్తువులు ఉన్నా.. వాటిని వినియోగించుకోలేని పరిస్థితి వారిది. అలాంటివారికి సాయం అందిస్తున్నారు.. పశ్చిమగోదావరిజిల్లా భీమవరం విష్ణు ఇంజనీరింగ్ మహిళా కళాశాల విద్యార్థినులు. విభిన్న ప్రతిభావంతులకు ఆధునిక సాంకేతిక పరికరాలు తయారీ చేసి వారికి తోడ్పాటు అందిస్తున్నారు.
విద్యార్థినిలతో తయారీ
విష్ణు ఇంజినీరింగ్ మహిళా కళాశాలలో అసెస్టివ్ ల్యాబ్ పేరుతో ఓ ప్రయోగశాల నెలకొల్పారు. విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన వస్తువులు ఈ ప్రయోగశాలలో విద్యార్థినులే తయారీ చేస్తారు. ఏటా మూడోసంవత్సరం చదువుతున్న విద్యార్థినులను ఎంపిక చేస్తారు. బదిరులు, అంధులు, ఇతర ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలలు, విద్యాసంస్థలను ఈ కళాశాల విద్యార్థినులు సందర్శిస్తారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుంటారు. బధిరులు, అంధులు, కాళ్లు చేతులు లేనివారు పడుతున్న ఇబ్బందులకు తగ్గట్టుగా పరికరాలు తయారు చేస్తారు.
పదేళ్ల నుంచి..
రెండువందల మంది విద్యార్థినులు గ్రూపులుగా ఏర్పడి ప్రత్యేక ప్రతిభావంతులకు అవసరమైన వస్తువులు తయారుచేసి.. ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం కళాశాల ఆర్థికసాయంతోపాటు, ప్రయోగశాల, ఇతర సాంకేతిక నిపుణులను విద్యార్థినులకు అందిస్తుంది. విద్యార్థినులు తయారు చేయాలనుకొన్న ప్రాజెక్టును ముందుగా నిపుణులతో పంచుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తమకు తెలిసిన టెక్నాలజీతో వస్తువులు తయారుచేసి ఇవ్వాలి. గత పదేళ్లుగా ఈ ప్రయోగశాల నుంచి వేలాదిమంది విభిన్న ప్రతిభావంతులకు వస్తువులను విద్యార్థినులు అందించారు.
ఇతర రాష్ట్రాల్లోనూ..
ఈ ప్రాజెక్టుల కోసం విదేశీ ప్రొఫెసర్లు, నిపుణుల సాయాన్ని తీసుకుంటున్నారు. కాళ్లులేనివారికి అధునాతనంగా ఉండే వీల్ ఛైర్లు, కళ్లులేనివారు చదవడం, రాయడం, మొబైల్ ఆపరేటింగ్, కంప్యూటర్ ఆపరేటింగ్, గేమ్స్ ఆడుకోవడం ఇలా అవసరమైన పరికరాలను రూపొందిస్తున్నారు. మూగ, చెవిటి వారికి సైతం పరికరాలు తయారు చేసి వితరణగా అందించడం ఏటా ఆనవాయితీగా చేపడుతున్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా ముంబాయి, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లోని దివ్యాంగుల ఆశ్రమాలను విద్యార్థినులు సందర్శిస్తున్నారు.