YS Viveka murder case Update: వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును ఏపీ బయట విచారించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరగా.. తాము కౌంటర్ వేసేందుకు సిద్దంగా ఉన్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఒకట్రెండు రోజులు సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరగా.. దర్యాప్తునకు సహకరించడం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. హత్య కేసు సాక్షులకు భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేసులోని తీవ్ర ఆరోపణల మేరకు వ్యవహరిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్టు చెప్పినట్లు ప్రస్తుతం భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు.
తమ వాదనలూ వినాలన్న వివేకా బంధువు పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వివేకా కుమార్తె మినహా మరెవరి వాదనలూ వినే అవసరం లేదని జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. కేసులో తమ వాదనలూ వినాలని ఎ-5 నిందితుడు శివశంకర్‌రెడ్డి కోరారు. బుధవారం వాదనల సందర్భంగా పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: