తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర(Ys Sharmila Padayatra) 100 కి.మీ.లకు చేరుకుంది. 9వ రోజు పాదయాత్రను వైఎస్ షర్మిల ఇబ్రహీంపట్నం మండల కేంద్రం నుంచి ఉదయం 9:30 గంటలకు ప్రారంభించారు. కప్పరపహాడ్, తుర్కగూడ, చర్లపటేల్ గూడ గ్రామం వరకు కొనసాగించారు. మధ్యాహ్నం 12 గంటలకు విరామం తీసుకుని భోజనం చేశారు.
తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు చర్లపటేల్ గూడ నుంచి, ఇబ్రహీంపట్నం క్రాస్‌రోడ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా.. కేసీఆర్ అవినీతి, నియంత పాలనను చూసి ప్రజలు విసిగిపోయారని షర్మిల ఆరోపించారు. కనీస వసతులు లేక ప్రజలు విలవిల్లాడుతున్నారని తెలిపారు. పాదయాత్ర ఆద్యంతం ప్రజల కన్నీటి వెతలే కనిపిస్తున్నాయని చెప్పారు. 60 ఏళ్ల వయస్సులోనూ అమ్మమ్మలు, తాతయ్యలు కూలీనాలి చేసి బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇబ్రహీంపట్నం క్రాస్‌రోడ్‌కు వచ్చే సరికి వైఎస్ షర్మిల పాదయాత్ర (Ys Sharmila Padayatra) 100 కిమీలకు చేరుకోవడంతో.. తల్లి విజయమ్మ పావురాలను పైకి ఎగురవేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం లేని వ్యక్తుల బుద్ధి ఎక్కడకు పోతుందని మండిపడ్డారు. పాదయాత్ర ముగిసిన తర్వాత వైఎస్ షర్మిల రాత్రికి ఇబ్రహీంపట్నం టౌన్లోనే బసచేశారు.
ఇదీ చూడండి: YS Sharmila Padayatra: నేటినుంచే వైఎస్ షర్మిల 'ప్రజా ప్రస్థానం'.. చేవెళ్ల నుంచే ప్రారంభం