ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టుకతో క్రైస్తవుడు అని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టంచేశారు. జగన్ సీఎం అయ్యేందుకు అన్ని మతాల వారు ఓట్లు వేశారని, హిందువులు భారీ స్థాయిలో ఓట్లు వేశారని తెలిపారు. మతాన్ని అడ్డుపెట్టుకుని జగన్‌పై రాజకీయ కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు. డిక్లరేషన్‌పై సంతకం చేసే సంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానం అమలుచేస్తోందని... పాతికేళ్లుగా ఆ సంప్రదాయం ప్రముఖులకు అమలు కావడం లేదన్నారు. ఎప్పుడూ లేనిది సీఎం జగన్ వెళ్లినప్పుడే ప్రతిపక్షాలకు ఈ విషయం గుర్తుకువస్తుందా అని ప్రశ్నించారు.
వారెవ్వరూ డిక్లరేషన్‌పై సంతకం చెయ్యలేదు
గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు శ్రీవారికి పట్టు వస్త్రాలిచ్చారని... క్రైస్తవ మతానికి చెందిన ఎన్.జనార్ధన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు కూడా పట్టువస్త్రాలు ఇచ్చారన్నారు. వారెవ్వరూ డిక్లరేషన్‌పై సంతకం పెట్టలేదన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నామాలు పెట్టుకుని, తగిన వస్త్రధారణతో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు ఇచ్చినా, దీనిపై వివాదం చేయడం సరికాదన్నారు. దేవుని ఆజ్ఞ మేరకే సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు ఇచ్చారని పేర్కొన్నారు. వివాదాలతో చలికాచుకునే చంద్రబాబుకు ప్రజలే సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. ప్రధాని మోదీపై కొడాలి నాని అలా మాట్లాడటం సరికాదని వైకాపా అభిప్రాయమని స్పష్టం చేశారు. ప్రధానిపై వ్యాఖ్యలు కొడాలి నాని వ్యక్తిగత వ్యాఖ్యలుగా పార్టీ భావిస్తోందని అంబటి రాంబాబు తెలిపారు.
ఇదీ చదవండి : తగ్గినట్టే తగ్గి పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 7855