‘ఈ ఫలితాలు చూసి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో పోటీచేస్తారని అనుకోవడం లేదు. ఒకవేళ పోటీచేస్తే మేం ఎవరిని నిలపాలనే దానిపై మంచి నిర్ణయం తీసుకుంటాం. పుంగనూరు వచ్చి నాపై పోటీచేయాలని చంద్రబాబును ఆహ్వానిస్తున్నా. మీపై గెలిచినా, ఓడినా మాకు బాగుంటుంది’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(minister peddireddy) పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘పార్టీని శూన్యం చేసిన చంద్రబాబు(Chandrababu) తన నియోజకవర్గంలోనూ మూలాలు లేకుండా చేసుకున్నారు. ఇంకా ఆయన పార్టీ అధినేతగా ఉండటం అసందర్భం. ఎన్టీఆర్ కుటుంబీకుల్లో ఎవరికైనా బాధ్యతలిచ్చి, ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలి. ప్రచారంలో మా గురించి దుర్మార్గంగా మాట్లాడారు. ఇకపై అనరాని మాటలంటే ఎలా స్పందిస్తానో చూపిస్తా’ అని హెచ్చరించారు. ‘దొంగ ఓట్లపై ఒక్క తెదేపా ఏజెంట్ కూడా ఫిర్యాదు చేయలేదు. సీఎం ఇన్ని కార్యక్రమాలు చేపట్టాక కుప్పంలో డబ్బులు పంచాల్సిన కర్మ మాకెందుకు?’ అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
కొండపల్లి మాకే వచ్చే అవకాశం: సజ్జల
‘చంద్రబాబు విషయంలో కుప్పం ప్రజలూ విసిగిపోయారు కాబట్టే ఇప్పుడు ఎన్నికల్లో నీకో దండం అన్నారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrisna Reddy) అన్నారు. ‘స్థానిక సంస్థల్లో 97% వరకు కైవసం చేసుకోవడం ద్వారా 2019లో 50% ఓట్లతో ప్రారంమైన వైకాపా జైత్రయాత్ర ఇప్పుడు 60-65శాతానికి చేరింది. కొండపల్లి కూడా మా ఖాతాలోకే వచ్చే అవకాశం ఉంది’ అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గుంటూరులో ఒక డివిజన్ గెలిచామని జాతీయస్థాయిలో తెదేపా పండగ చేయాలనుకుంటే వారికి దండం పెట్టడం తప్ప ఏమనగలం? వైకాపా ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలంటూ అచ్చెన్నాయుడు తలకాయ లేని డిమాండ్ చేస్తున్నారు. వాళ్లకున్న పదిమందో 20 మందో ముందు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లి రెఫరెండం అని సవాల్ చేయమనండి’ అన్నారు.
బాబు, లోకేశ్‌కు నియోజకవర్గాల్లేవు: విజయసాయిరెడ్డి
‘మంగళగిరిలో లోకేశ్‌కు, కుప్పంలో చంద్రబాబుకు ఇక నియోజకవర్గాల్లేవు. వచ్చే ఎన్నికల్లో వారిద్దరూ వేరే నియోజకవర్గాలు చూసుకోవాల్సిందే’ అని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. ‘స్థానిక సంస్థల ఫలితాలతో తెదేపా పని పూర్తయిందని, 2024 ఎన్నికల తర్వాత ఆ పార్టీ అంతర్ధానమవుతుందని అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడింది. ఇక హైదరాబాద్ ప్రవాసాంధ్రుడిగా చంద్రబాబు విశ్రాంతి తీసుకోవచ్చు. కేసు పెడితే 48గంటల్లో స్టే తెస్తానని లోకేశ్ మాట్లాడడం న్యాయవ్యవస్థను కించపరచడమే. ప్రజల మనసు గెలుచుకోలేని చంద్రబాబు ఇప్పుడు అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలు పెడితే గెలుస్తారా?’ అని ప్రశ్నించారు.
కుప్పం ప్రజలకు స్వాతంత్య్రం: నారాయణస్వామి
‘కుప్పం ప్రజలకు ఇపుడు అసలైన స్వాతంత్య్రం వచ్చింది. సీఎం జగన్‌ను బాధించేలా చంద్రబాబు విమర్శలు చేయడంతో.. ప్రజలంతా జగన్‌కు చేరువయ్యారు. ప్రతిసారీ 40వేల దొంగ ఓట్లు వేసుకొని బాబు గెలిచేవారు’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి: మంత్రి అవంతి
‘మూడుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన ప్రజల పట్ల కృతజ్ఞతతోనైనా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి. కులం, మతం, మాకు ఓట్లు వేశారా లేదా అనేది చూడకుండా సంక్షేమ పథకాలను అర్హులందరికీ ముఖ్యమంత్రి జగన్ అందించారు. కానీ, ఇప్పుడు ఫలితాలతో సీఎం విజన్ అర్థమైంది’ అని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
బాబు పతనం తుది అంకానికి: కన్నబాబు, వెలంపల్లి, వేణుగోపాలకృష్ణ
చంద్రబాబు పతనం తుది అంకానికి చేరుకుందని మంత్రులు కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. కుప్పం ప్రజలు వాస్తవం గుర్తించి ఆయన్ను పక్కనబెట్టారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం ఎదుట ఆ పార్టీ తశ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని అందరికీ తెలుసు. చివరకు కుప్పంలోనూ నమ్మడం లేదని తేలిపోయింది’ అని వెల్లడించారు.
చంద్రబాబు కుప్పం కోట కూలింది: విప్ శ్రీనివాసులు
మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం కోట కూలిందని ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. తెదేపా, భాజపా, జనసేన మూడు పార్టీలూ కలిసి ఎన్ని చేసినా ముఖ్యమంత్రి జగన్‌పట్ల ప్రజలకు ఏర్పడిన విశ్వాసాన్ని ఆపలేకపోయాయని పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబుకు గౌరవం దక్కాలంటే ఆయన తెదేపాను మూసేయాలన్నారు.
ఇవీచదవండి.
- హైకోర్టు తరలింపు అంత సులభం కాదు.. రాజధాని కేసులో వాదనలు
- CM KCR Letter to PM: ఎంత కొంటారో చెప్పండి.. ప్రధానికి కేసీఆర్ లేఖ
- Election Results: ‘పుర’ ఓట్ల కౌంటింగ్.. ఎక్కడెక్కడ ఏయే పార్టీలు గెలిచాయంటే..?
- AP Governor Covid positive: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్
- CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 230 కరోనా కేసులు, 3 మరణాలు