పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మాత్రం ఆ నియోజకవర్గం ఉన్న జిల్లా అంతటికీ వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం స్పష్టం చేసింది. ప్రస్తుత ఉప ఎన్నికతో ముడిపడిన కార్యకలాపాలు జిల్లాలో ఎక్కడ నిర్వహించినా.. దానికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కొవిడ్ నిబంధనలు, వ్యయ పర్యవేక్షణ నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నియోజకవర్గాల బయట రాజకీయ కార్యకలాపాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. జిల్లా ఎన్నికల అధికారులు అలాంటి అంశాల్లో తగిన విధంగా స్పందించి.. నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. ఒకవేళ సదరు నియోజకవర్గం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కానీ, మెట్రోపాలిటన్ సిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లలోగానీ అంతర్భాగంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రవర్తనా నియమావళి కేవలం ఆ నియోజకవర్గానికి పరిమితమవుతుందని పేర్కొంది. మిగిలిన అన్ని నియోజకవర్గాల విషయంలో మాత్రం ప్రవర్తనా నియమావళి ఆ జిల్లా అంతటా వర్తిస్తుందని తేల్చి చెప్పింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కరోనా నిబంధనలతోపాటు ఎన్నికల వ్యయం అభ్యర్థులు, పార్టీల ఖాతాలోకి రాకుండా ఉండేందుకు సరిహద్దు ప్రాంతాల్లో ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వివిధ ప్రాంతాల నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు రావటంతో మునుపటి ఉత్తర్వులను సవరించినట్లు తాజాగా పేర్కొంది.
ఇదీ చూడండి: CBN: సరిదిద్దుకోలేని తప్పు చేశారు.. సీఎం, డీజీపీలపై బాబు ఆగ్రహం