నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురు, శుక్రవారాల్లో పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పలు చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. వరద నీటి ఉద్ధృతికి రాకపోకలు స్తంభించాయి. రహదారులు కోతకు గురయ్యాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. కోస్తా, రాయలసీమల్లో వేలాది ఎకరాల్లో పత్తి, మిరప, మినుము, మొక్కజొన్నతోపాటు ఇతర ఉద్యాన పంటలు నీట మునిగాయి. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు చనిపోగా.. ఒకరు గల్లంతయ్యారు. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30గంటల మధ్య రాష్ట్రంలోనే అధికంగా ఏలూరులో 14.5 సెం.మీ.వర్షపాతం నమోదైంది. కడప జిల్లాలో వరద ముంచెత్తడంతో పశువులు, ఎడ్లబండ్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.
* అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. తలుపుల మండలంలో ఐదు చెరువులు తెగాయి. ఈ నీరు ముంచెత్తడంతో పులివెందుల మండలంలోని ఉట్నూతలపల్లిని వరద ముంచెత్తింది. కదిరి-పులివెందుల మార్గంలో రహదారి కోతకు గురైంది. వరద ఉద్ధృతికి ఓదులపల్లి వద్ద కారు గల్లంతై ఒకరు చనిపోగా.. మరొకరు గల్లంతయ్యారు.
* గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, పల్నాడు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. వాగు దాటుతూ వెల్దుర్తి మండలం బోదలవీడు వద్ద తమావత్ శ్రీను కొట్టుకుపోయి చనిపోయారు. 3రోజులనుంచి కురుస్తున్న వర్షాలతో పెదకూరపాడు, అమరావతి, తాడికొండ, వెల్దుర్తి మండలాల్లో లోతట్టు పొలాల్లో వేసిన పత్తి ఉరకెత్తింది.
* కృష్ణా జిల్లా నందిగామలో భారీ వర్షానికి పలు చోట్ల వాగులు పొంగాయి. కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద రహదారిపై వరద పోటెత్తి రాకపోకలు నిలిచాయి. చందర్లపాడు మండలం పొటెంపాడు సమీపంలోనూ వరద పెరిగి రాకపోకలు స్తంభించాయి. విజయవాడ చిట్టినగర్, పాలఫ్యాక్టరీ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి.
* భారీవర్షంతో ఏలూరులో ప్రభుత్వ కార్యాలయాల్లోకి నీరు చేరింది. పవర్‌పేట, కొత్తపేట, ఆర్‌ఆర్‌పేట ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.
* కర్నూలు జిల్లా చాగలమర్రిలో పంటలు మునిగాయి.
* అనంతపురం జిల్లా ముదిగుబ్బ, తలుపుల, గుంటూరు జిల్లా మంగళగిరి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, సీతారామపురం, కడప జిల్లా గాలివీడు, లింగాల, కృష్ణా జిల్లా వీరులపాడు, చిత్తూరు జిల్లా తవణంపల్లి, పూతలపట్టు, పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురం, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ప్రాంతాల్లో 6 సెం.మీ.నుంచి 9.5 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైంది.
6న అల్పపీడనం!
ఉపరితల ఆవర్తన ప్రభావంతో శని, ఆదివారాల్లో విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటినుంచి మోస్తరు వానలు కురుస్తాయని వివరించారు. ఈనెల 6న ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనమేర్పడే అవకాశం ఉందని అన్నారు.
13 గేదెలు, నాలుగు ఆవులు మృతి
అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షానికి అదే జిల్లాలోని తలుపుల మండలం వాదులపల్లె, చిన్నపల్లె గ్రామాల సమీపంలోని చెరువు కట్టలు తెగిపోయాయి. దీంతో కడప జిల్లా పులివెందుల మండలం మోట్నూతలపల్లెలోకి వరద నీరు వచ్చి చేరింది. గ్రామంలో పలువురు రైతులకు చెందిన 13 గేదెలు, నాలుగు ఆవులు వరద ప్రవాహంలో చిక్కుకుని మృత్యువాత పడ్డాయి.
పెరిగిన పోలవరం నీటిమట్టం
పోలవరం, న్యూస్‌టుడే: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం శుక్రవారం సాయంత్రానికి 29.68 మీటర్లకు చేరింది. 48 క్రస్టు గేట్ల ద్వారా 2.10లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది.
ఇదీ చదవండీ.. Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెనపై హైకోర్టు కీలక ఆదేశాలు