weather forecast: అండమాన్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ ప్రకటించింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కి.మీ దూరంలో.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 1,020 కి.మీ దూరాన.. పారాదీప్‌కు ఆగ్నేయంగా 1,060 కి.మీ దూరంలో ప్రస్తుతం కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. పశ్చిమ వాయవ్య దిశగా వాయుగుండం పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయానికి ఉత్తర కోస్తా-ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చే సూచన ఉన్నట్లు స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపటి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రత్యేకంగా ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది. ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఒకటి.. రెండుచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపింది.
ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
weather forecast : ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఉన్న అండమాన్‌లో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ, తూర్పుమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. ఆ తరువాత 24 గంటల్లో వాయుగుండం.. మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ఇది వాయువ్య దిశగా పయనించి శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర - ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని యంత్రాంగం ముందస్తుగా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చినట్టు వెల్లడించింది.
దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ, శనివారం ఉదయం 70-90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని.. సముద్రం అలజడిగా ఉంటుందని మత్య్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు: సీఎం
weather forecast : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సహాయ శిబిరాలు ఏర్పాటుచేయాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తుపాను సన్నద్ధతపై గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. లోతట్టు, ముంపు ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. తుపాను పరిస్థితిని సమీక్షించేందుకు ముగ్గురు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతీలాల్‌దండే, విశాఖపట్నానికి శ్యామలరావును నియమించారు. వీరు వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.
పాఠశాలలకు సెలవులు...
బీ ప్రభుత్వ సిబ్బందికి జిల్లాల కలెక్టర్లు సెలవులు రద్దుచేశారు. నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విజయనగరం జిల్లాలో శుక్ర, శనివారాల్లో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ సూర్యకుమారి ప్రకటించారు. తీర ప్రాంత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోనూ ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సెలవులు ప్రకటించారు. ఈ నెల 3 నుంచి 5 వరకు విశాఖపట్నంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ఆ జిల్లా అధికారులు వెల్లడించారు. శుక్రవారం బయలుదేరే పలు రైళ్లను ద.మ.రైల్వే రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
అప్రమత్తంగా ఉండండి: ప్రధాని మోదీ
weather forecast : ‘జవాద్’ తుపాను దృష్ట్యా తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర సంస్థల సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. ముప్పు ఉందని భావించే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తాగునీరు, మందుల వంటి అత్యవసరాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. 24 గంటల పాటు కంట్రోలు రూమ్‌లు పనిచేసేలా చూడాలన్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు...
weather forecast : ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మంత్రిత్వ శాఖలతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కూడా సమీక్షించారు. కేంద్ర హోంశాఖ కూడా 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ స్పందన నిధి నుంచి తొలి విడత నిధులు విడుదల చేసింది. బోట్లు, రంపాలు, టెలికాం పరికరాలతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 29 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మరో 33 బృందాలను సన్నద్ధం చేశారు. కోస్టుగార్డు, నేవీకి చెందిన హెలికాప్టర్లు, నౌకలను సిద్ధం చేశారు. వాయు సేన, ఆర్మీలోని ఇంజినీరింగ్ కార్యాచరణ బృందాలను సహాయ చర్యలకు ఉపయోగించనున్నారు. వైద్య, విద్యుత్తు, టెలి కమ్యూనికేషన్, జలరవాణా శాఖల ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: