రాష్ట్రంలో దేవాలయాలపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక యాత్ర చేపట్టనున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఇది తిరుపతిలోని కపిలతీర్థం నుంచి విజయనగరం జిల్లా రామతీర్థం వరకు సాగుతుందన్నారు. విశాఖలోని రుషికొండలో ఆదివారం పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, నేతలు సునీల్ దేవధర్, సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం, అంతకుముందు సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడారు. దాడులు జరిగిన దేవాలయాలన్నింటినీ కలుపుతూ.. 7 నుంచి 8 రోజులపాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. ఈ ఘటనల వెనుక భాజపా నాయకులున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. ఈ నెల 20లోగా డీజీపీ క్షమాపణ చెప్పాలన్నారు. తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు.
చర్చిల ఆస్తులపై శ్వేతపత్రం ఇవ్వాలి
‘చర్చిల ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. చాలా చర్చిలకు వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అలాంటప్పుడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటి నిర్మాణానికి నిధులివ్వాలి? ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రజాధనంతో పాస్టర్లకు జీతాలివ్వడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. హిందువులకు వ్యతిరేకంగా డీజీపీ వైఖరి సాగుతోందని, దీనికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. జరిగిన అనేక పరిణామాలకు బాధ్యుడిగా డీజీపీని ఆ పదవి నుంచి తొలగించాలని కోరారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తిని తెరమీదకు తీసుకువచ్చారని వీర్రాజు ఆరోపించారు. దాడుల ఘటనలపై పోలీసులు మొక్కుబడిగానే విచారణ చేశారని, అమాయకులైన భాజపా నాయకులపై అకారణంగా కేసులు పెడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- భాజపాలోకి ఇతర పార్టీల నాయకులను తీసుకోవడానికి అవసరమైన కార్యాచరణ రూపొందించడానికి వీలుగా విశాఖలో జరిగిన సమావేశంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఎవరు ఉంటారన్న విషయాన్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.
- రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై, డీజీపీ వైఖరిపై సమగ్ర నివేదికను రూపొందించి భాజపా అధిష్ఠానానికి సమర్పించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి
కేంద్రానికి భాజపా నేతలు ఫిర్యాదు చేసుకోవచ్చు: మంత్రి వెల్లంపల్లి