పరిశ్రమల శాఖమంత్రిగా రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా... మంత్రి గౌతంరెడ్డిని ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా సత్కరించారు. కొవిడ్ పరిస్థితుల్లోనూ 1.5 శాతం మేర అభివృద్ధి రేటు నమోదు చేశామని మంత్రి గౌతంరెడ్డి వివరించారు. సంక్షేమ పథకాలు, దీర్ఘకాలిక ప్రణాళికలతో సాధ్యమైందన్న గౌతంరెడ్డి... పెట్టుబడుల ఆకర్షణకు మౌలిక సదుపాయాలు అవసరమని అభిప్రాయపడ్డారు.
ఆక్వా, ఫార్మా, ఖనిజ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణంపై దృష్టి పెట్టాం. జులైలో నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. రెండో దశలో మరిన్ని ఫిషింగ్ హార్బర్లు వస్తాయి. భోగాపురం విమానాశ్రయం కూడా త్వరితగతిన నిర్మాణం చేస్తాం. ఇప్పటికే కర్నూలు విమానాశ్రయం జాతికి అంకితమైంది. ఒప్పందాలు మాత్రమే చేసుకునే ప్రభుత్వం మాది కాదు. కడప జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్ కూడా రాబోతోంది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఎస్సార్ స్టీల్స్ ముందుకొచ్చింది.-మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.
2014-19 మధ్య పరిశ్రమల బకాయిలు రూ.1,032 కోట్లు చెల్లించామని మంత్రి గౌతంరెడ్డి వివరించారు. కొవిడ్ కష్టాలున్నా రెండేళ్లలో 14 వేల ఎంఎస్‌ఎంఈలు స్థాపించామని వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా రూ.4,300 కోట్ల పెట్టుబడులు సాధించామన్న గౌతంరెడ్డి... 14 వేల ఎంఎస్‌ఎంఈల్లో 88 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు.
రాష్ట్రంలో త్వరలోనే 30 నైపుణ్య కళాశాలలు నిర్మాణం చేస్తామని మంత్రి గౌతంరెడ్డి వెల్లడించారు. పరిశ్రమలకు ఏం కావాలనే అంశంపై సమగ్ర పరిశ్రమల సర్వే చేస్తామన్నారు. నైపుణ్యాభివృద్ధిలో ఏపీకి అసోచామ్ మొదటి ర్యాంక్ ఇచ్చిందని వివరించారు. రాష్ట్రంలో బంగారు గనులకు అనుమతిలో నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.
కాలుష్యరహిత పరిశ్రమలనే ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి గౌతంరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ గంగవరం పోర్టులో ప్రమోటర్లు మాత్రమే మారుతున్నారన్న మంత్రి... డీవీఎస్ రాజు నుంచి అదానీ పోర్ట్స్, సెజ్‌కు మాత్రమే మారుతోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి వాటా ఏ మాత్రం మారలేదని మంత్రి గౌతంరెడ్డి వివరించారు.