ap tg water disputes : కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ అమలు విషయమై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ దృశ్యమాధ్యమం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. నిర్వహణ కోసం రెండు రాష్ట్రాల నుంచి ఒక్కో బోర్డుకు రెండు వందల కోట్ల చొప్పున సీడ్ మనీ డిపాజిట్ చేయడం, ప్రాజెక్టుల వివరాలను ఇవ్వడంతో పాటు స్వాధీనం చేయడం, అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతులు పొందడం, ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ భద్రత విషయమై సమావేశంలో చర్చించారు.
వాదనలు వినిపించిన ఇరు రాష్ట్రాలు
Jal Shakti Meeting : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు గతంలో వినిపించిన వాదనలను మరోమారు వివరించాయి. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకున్న నేపథ్యంలో అంతర్రాష్ట్ర జల వివాదాలచట్టం ప్రకారం తెలంగాణకు నీటి కేటాయింపుల కోసం మూడో సెక్షన్ కింద ట్రైబ్యునల్‌కు నివేదించాలని... ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకుండా బోర్డు ఎలా నిర్వహణ చేపడుతుందని తెలంగాణ ప్రశ్నించింది. ఆపరేషన్ ప్రొటోకాల్, రూల్ కర్వ్స్ విషయంలో తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పామని, బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా బోర్డు ఎలా పనిచేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులు లేని పరిస్థితుల్లో బోర్డు పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందన్న తెలంగాణ... 200 కోట్ల నిధులు గోదావరి బోర్డు ఎందుకని ప్రశ్నించింది.
ఆ ఆరు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వండి
కృష్ణా బోర్డు కూడా ఒకేమారు 200 కోట్ల సీడ్మని ఇవ్వాల్సిన అవసరం ఏముందని, వాటిని దేనికి ఖర్చు చేస్తారని అడిగింది. గోదావరిపై ప్రాజెక్టులకు సంబంధించి ఐదింటిని గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించాలని ఇప్పటికే కోరామన్న తెలంగాణ... డీపీఆర్‌లు సమర్పించిన ఆరు ప్రాజెక్టులకు వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరింది.
పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ
ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ భద్రత అంశంపైనా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రాష్ట్రాల హక్కుల్లో జోక్యం చేసుకోవడమేనని వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై రాయలసీమ ఎత్తిపోతల సహా అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ట్రైబ్యునల్‌కు నివేదించే విషయమై న్యాయశాఖ సలహా కోరామన్న కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్... న్యాయ సలహా వచ్చాక ఆ విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేంద్ర జలసంఘం వద్ద పెండింగ్‌లో ఉన్న ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించి అనుమతి ఇస్తామని అన్నారు. తెలంగాణ ప్రస్తావించిన ఏపీ ప్రాజెక్టుల అంశాన్ని పరిశీలిస్తామని పంకజ్ కుమార్ తెలిపారు. 200 కోట్ల సీడ్ మనీ విషయమై మరోమారు ఆలోచిస్తామని, ఎంతో కొంత డిపాజిట్ చేయక తప్పదని స్పష్టం చేశారు.
త్వరలో అత్యున్నత మండలి సమావేశం
ఉమ్మడి ప్రాజెక్టుపైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ను కృష్ణా బోర్డుకు అపగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయమై ఒక నిర్ణయానికి వచ్చి ఏదో ఒకటి చేయాల్సిందేనని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేద్దామన్న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి... త్వరలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి అన్ని అంశాలు చర్చిద్దామని అన్నారు. అత్యున్నత మండలి సమావేశం కోసం ఎజెండా అంశాలు పంపాలని రెండు రాష్ట్రాల అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి: Prakash javadekar on YSRCP: బెయిల్‌పై ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చు: ప్రకాశ్ జవదేకర్