employees transfers : ప్రజారోగ్యశాఖ (డైరెక్టర్ ఆఫ్ హెల్త్)లో బదిలీలకు సంబంధించి ఐచ్ఛికాల (ఆప్షన్లు) నమోదు మూడు రోజుల క్రితం ప్రారంభం కావాల్సి ఉన్నా ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఆప్షన్ల నమోదుకు ఎదురు చూస్తున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యశాఖ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మలేరియా, కుష్ఠు ఇతర కార్యాలయాలు కూడా జిల్లాల స్థాయిలో ఉన్నాయి. ఆసుపత్రులు, కార్యాలయాలు ఎక్కువ ఉన్నందున క్యాడర్ సంఖ్య కూడా భారీగా ఉంది. ప్రభుత్వ నిబంధనను అనుసరించి అయిదేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి తప్పనిసరిగా బదిలీ అవుతుంది. కటాఫ్, ఇతర షరతులు వర్తిస్తాయి. దీనివల్ల వేల మందికి స్థానచలనం కలుగుతుంది. ఆప్షన్ల నమోదు ప్రారంభం కాకపోవడంపై అధికారులను వివరణ కోరగా.. సాప్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్య తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలు కారణంగా ఒకటి రెండు రోజులు జాప్యం జరుగుతుందని చెప్పారు.
బోధనాసుపత్రుల్లో..
బోధనాసుపత్రుల్లో బదిలీలకు సంబంధించి ఆప్షన్ల నమోదు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీల వారీగా (జనరల్ సర్జరీ, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలు) మంజూరైన పోస్టుల సంఖ్యను అనుసరించి స్టేషన్ సీనియారిటీ ప్రకారం అయిదేళ్లు పూర్తయిన వారికి 30% కటాఫ్ లోబడి బదిలీ చేస్తున్నారు. ఈ జాబితాలోకి వచ్చే మొత్తం 1,100 మందిలో వైద్యులే 90 శాతం ఉన్నారు. మరోపక్క 30% కటాఫ్‌తో ఏ విధంగా జాబితాలను రూపొందించారనే దానిపై కొంతమంది వైద్యుల్లో స్పష్టత లోపించింది. కొందరి పేర్లు ఉన్నాయని, మరికొందరి పేర్లు లేవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 30% కటాఫ్‌కు లోబడి బదిలీల జాబితాను ఆదివారం సాయంత్రం విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రాఘవేంద్రరావు తెలిపారు. బదిలీలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నందున నష్టపోతున్నామని కర్నూలు వైద్యకళాశాలలో పనిచేసే వైద్యులు చెబుతున్నారు. సోమవారం విధులకు దూరంగా ఉంటామని వారిలో కొందరు ప్రకటించారు. మార్చి 1 నుంచి సమ్మె చేస్తామని తెలిపారు. అయితే ఆదివారం కొద్దిమంది ఆప్షన్లు నమోదు చేసుకున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.. నేడు విడుదల చేయనున్న సీఎం జగన్