రాష్ట్రవ్యాప్తంగా వినాయకచవితి సందడి నెలకొంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే భక్తులు వేడుకలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీలక్ష్మి గణపతి స్వామి చెవిలో భక్తులు తమ కోర్కెలు చెప్పుకున్నారు.
కర్నూల్లోని విఘ్నేశ్వర ఆలయానికి పెద్దసంఖ్యలో వచ్చి పూజలు నిర్వహించారు. వీధుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను దర్శించుకుంటున్నారు. నంద్యాలలో మొక్కజొన్నలతో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ భక్తులను ఆకట్టుకుంది. 5 వేల మొక్కజొన్నలతో శ్రీ భగవత్ సేవా సమాజ్ సభ్యులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ శ్రీ అంకుర జూర్ణ మహా గణపతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
కృష్ణా జిల్లా నూజివీడు మార్కెట్లలో పండగ సందడి నెలకొంది. పూజా సామగ్రి కొనుగోలుతో మార్కెట్లు కోలాహలంగా మారాయి. మార్కెట్ కూడళ్లలో వాహనాలు నిలిచి రద్దీగా మారింది.
విజయవాడలో క్షిప్ర గణపతికి ఘనంగా అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉండ్రాళ్ల, పాల అభిషేకంతో నిర్వహించారు. హోమమూ చేస్తారు. బొజ్జ గణపతిని పూలతో అలంకరించారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. తొలిరోజు కథాశ్రవణంతోపాటు కలశస్థాపన, విశేష పత్రి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆలయాలు రద్దీగా మారాయి. సజ్జాపురంలోని విఘ్నేశ్వరుని ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి అక్షతలను తలపై వేసుకున్నారు. పాత ఊర్లోని బాల గణపతి ఆలయమూ భక్తులతో రద్దీగా మారింది.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో వినాయకమండపాలను అందంగా ముస్తాబు చేశారు. విగ్రహాలు దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
శ్రీశైలంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ యాగశాలలో శాస్త్రోక్తంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవ పూజలను ఆలయ ఈవో లవన్న, అర్చకులు ప్రారంభించారు. సాక్షి గణపతి ఆలయం వద్ద మృత్తిక గణపతిని ఏర్పాటు చేశారు. సాక్షి గణపతిస్వామికి వ్రతకల్ప పూర్వక పూజలు చేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 19 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. కరోనా దృష్ట్యా ఏకాంతంగా శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రేపు ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 12న నెమలి, 13న మూషిక, 14న శేషవాహన సేవలు, అలాగే 15న ఉదయం చిలుక, రాత్రి వృషభ సేవలు, 16న గజ, 17న రథోత్సవం జరపనున్నారు. ఈ నెల 18న తిరుకల్యాణం, అశ్వవాహన సేవ , 19న తీర్థవారి త్రిశూల స్నానం, వడాయత్తు ఉత్సవం జరిపి ఏకాంత సేవతో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: Ganesh Chaturthi: వినాయకుడి రూపాలెన్ని? పూజ ఎలా చేయాలి?