OIL:మార్కెట్ ధర కంటే తక్కువకే విజయ బ్రాండ్ వంట నూనెలను వినియోగదారులకు అందించాలని పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో వాటిని అందుబాటులో ఉంచేలా చూడాలని తెలిపారు. వంట నూనెల ధరలు పెరుగుతాయనే అపోహలు అవసరం లేదని ప్రజలకు సూచించారు. వంట నూనెల ధరల నియంత్రణపై మంగళవారం ఆయన సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో చర్చించారు.
"పామోలిన్‌కు బదులు సోయాబీన్, రైస్‌బ్రాన్ నూనె వాడకాన్ని ప్రోత్సహించాలి. వాటిని ఏపీ ఆయిల్‌ఫెడ్ ద్వారా అమ్మించాలి. ఆవనూనె అందుబాటులో ఉంచేలా భారత ప్రభుత్వాన్ని కోరాలి. రిఫైన్డ్ పామోలిన్ పైనే ఇండోనేషియా ఆంక్షలు విధించింది. క్రూడ్ పామోలిన్‌పై ఎలాంటి ఆంక్షలూ లేవు. ఇందుకు అనుగుణంగా ఏపీ ఆయిల్‌ఫెడ్ ఉత్పత్తి పెంచాలి. పొదుపు సంఘాల ద్వారా విక్రయించేలా చర్యలు తీసుకోవాలి" -కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌర సరఫరాలశాఖ మంత్రి
22,598 క్వింటాళ్ల నూనె జప్తు: పరిమితికి మించి నూనెల నిల్వకు సంబంధించి 76 కేసులు నమోదు చేసి 22,598 క్వింటాళ్ల నూనె జప్తు చేసినట్లు అధికారులు వివరించారు. కేసులను పరిష్కరించిన తర్వాత నూనెలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు పౌర సరఫరాలశాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు.
ఇదీ చదవండి: సీరియస్‌గా ఆరా తీస్తున్న కేంద్రం.. అప్పుల గుట్టు రట్టయ్యేనా!