UTF: ఉద్యోగ, ఉపాధ్యాయుల సామాజిక భద్రతకు గ్యారంటీ లేకుండా ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానాన్ని ఉపసంహరించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌లు ప్రభుత్వాన్ని కోరారు. పాత పింఛను విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఓపీఎస్ అమలుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘ఎన్నికలకు ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు తెలియక హామీ ఇచ్చామని చెప్పడం బాధ్యతారాహిత్యమే. జీపీఎస్ కింద 22 శాతం గ్యారంటీ పింఛను ఎలా ఇస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయకుండా మరోసారి ఉద్యోగులను భ్రమలకు గురి చేయడం భావ్యం కాదు. జాతీయ విద్యా విధానం-2020 పేరుతో కేంద్రం విద్యారంగంలోకి తీసుకొచ్చిన వ్యాపారీకరణ, కేంద్రీకరణ, మతతత్వీకరణ విధానాలను ఉపసంహరించాలి. సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ అమలు చేయాలనే డిమాండ్లతో ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించాలి. పంచాయతీరాజ్, మున్సిపల్, గిరిజన పాఠశాల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలి’ అని పేర్కొన్నారు. వీటితో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.
ఇవీ చదవండి: