Paddy Procurement Issue: దేశంలో వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్‌మెంట్‌నే అమలు చేస్తున్నామని కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం, కేంద్రం మధ్యలో కొనసాగుతోన్న వివాదం నేపథ్యంలో పాండే స్పష్టతనిచ్చారు. బియ్యం సేకరణపై తెలంగాణ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. బియ్యం సేకరణ విషయంలో ఏ రాష్ట్రంపైనా కేంద్రానికి వివక్ష ఉండదన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి బాయిల్డ్ సేకరణను తగ్గించినట్టు వివరించారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ ఏ రాష్ట్రంలోనూ పారాబాయిల్డ్ రైసు తీసుకోవట్లేదన్నారు.
"ధాన్యంపై తెలంగాణ ఆరోపణలు అవాస్తవం. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం సేకరిస్తున్నాం. ఏపీ, తెలంగాణ రెండూ ఒకే వాతావరణ జోన్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తోంది. రా రైస్ ఎంతైనా సేకరించేందుకు ఎఫ్‌సీఐ సిద్ధంగా ఉంది. రా రైస్ ఇచ్చేందుకు అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. దేశమంతా ఒకే ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని మేం అవలంభిస్తున్నాం. ధాన్యం విషయంలో రైతులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే సంబంధం ఉంటుంది. బియ్యం సేకరణపై మాత్రమే రాష్ట్రాలతో మా ఒప్పందం ఉంటుంది. రాష్ట్రాల నుంచి తీసుకోవాల్సిన బియ్యం ఇంకా ఉందనేది వాస్తవం." - సుధాంశు పాండే, కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శి
ధాన్యం సేకరించటం సాధ్యం కాదు..: ఎఫ్‌సీఐ వద్ద ఇప్పటికే 40 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ఉందని సుధాంశు పాండే తెలిపారు. అత్యధికంగా తెలంగాణ నుంచి 48.8 లక్షల టన్నుల బాయిల్డ్ రైసు తీసుకున్నామన్న పాండే... రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మరో 20 లక్షల టన్నుల పారాబాయిల్డ్ రైసు సేకరించినట్టు తెలిపారు. ధాన్యం విషయంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలే అవగాహన కల్పించాలని సూచించారు.
పంజాబ్ నుంచి గింజ కూడా తీసుకోలేదు: ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేకరించడం సాధ్యం కాదని మరోసారి స్పష్టం చేశారు. ధాన్యం మిల్లింగ్ చేసినందుకు మిల్లర్లకు డబ్బు చెల్లిస్తున్నామని... ఒక ఏజెంట్‌గా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం సేకరిస్తాయని వివరించారు. పంజాబ్ నుంచి ఒక్క గింజ కూడా బాయిల్డ్ రైస్ తీసుకోలేదన్నారు. పంజాబ్‌లో ధాన్యాన్ని మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తోందని తెలిపారు. ఏపీలోనూ ఎఫ్‌సీఐ నిబంధనల ప్రకారమే ధాన్యం సేకరిస్తున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: నాకు మంత్రి పదవి రాకుండా చేసింది వారే : ఎమ్మెల్యే సామినేని