Actual Revenue Deficit of AP : రాష్ట్రానికి సంబంధించి 2014-15 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటుపై కేంద్రం మళ్లీ ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఆ ఏడాది రెవెన్యూ లోటును కేంద్రమే భరిస్తుందని విభజన హామీగా ఉంది. ఈ విషయంలో ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. విభజన హామీ ప్రకారం తొలి ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం తిరిగి ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. తాజాగా జనవరి నాల్గవ వారంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొందరు రాష్ట్ర ఉన్నతాధికారులు, పలువురు ఎంపీలతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను రాష్ట్ర ప్రభుత్వం... కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. అందులో భాగంగానే కేంద్రం నుంచి వనరుల భర్తీకి ఇంకా రూ.18,830.87 కోట్లు రావాల్సి ఉందని కూడా పేర్కొంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ ఏడాది రెవెన్యూ లోటుపై పక్కా లెక్కలు అడిగినట్లు తెలిసింది. ఇందుకు అవసరమైన సమాచారం పంపాలని అన్ని ప్రభుత్వ విభాగాధిపతులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీనిపై మంగళవారం ఒక సమావేశం కూడా నిర్వహించారు.
ఇదీ సీఎస్ కోరిన సమాచారం...
* రెవెన్యూ లోటు భర్తీ క్రమంలో... కేంద్ర ప్రభుత్వం 2014-15, అంతకుముందు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఖర్చుల సమగ్ర వివరాలను కోరుతోంది. 2015 మార్చి 31లోపు చెల్లింపులు జరగని అన్ని బిల్లుల వివరాలు కావాలి.
* రాష్ట్ర సచివాలయ కార్యదర్శుల వారీగా, ఆయా విభాగాధిపతుల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఎంత, చేసిన ఖర్చు ఎంత అన్న సమగ్ర వివరాలను ప్రొఫార్మాలో నింపి పంపాలి.
* ప్రతి డీడీవో (డ్రాయింగ్ డిస్‌బర్సుమెంటు అధికారి) నుంచి సమాచారం తీసుకుని దాన్ని ధ్రువీకరించి పంపాలి.
* 2014-15, అంతకుముందు సంవత్సరాలకు సంబంధించి ఏయే బిల్లులు అప్‌లోడ్ అయ్యాయి? వాటిలో ఏఏ బిల్లులను ఎంత మొత్తం మేరకు చెల్లింపులు చేయలేదనే వివరాలను పేర్కొనాలి. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు ఆయా బిల్లులకు చెల్లింపులు జరిగాయో కూడా స్పష్టంగా పేర్కొనాలి. మొత్తం సమాచారాన్ని పక్కాగా రికార్డుల ఆధారంగా, ఎంబుక్‌ల వారీగా తయారు చేసి, ధ్రువీకరించి, ఈ నెల 10లోపు పంపాలి.
రాష్ట్ర బహిరంగ రుణ పరిమితి దాటేసిందా ?.. తాజాగా రూ. 2 వేల కోట్ల రుణం