రాజధాని అమరావతి కోసం మరో ఇద్దరు రైతుల గుండె ఆగింది. వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు (55) గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి అప్పారావు 7 ఎకరాలు ఇచ్చారు. రాజధాని తరలింపుపై అప్పారావు కొన్నాళ్లుగా ఆందోళనలో ఉన్నారు. అమరావతి ఉద్యమంలో కొడుకు, కోడలిపై పోలీసులు కేసులు పెట్టారని మనోవేదనతోనే ఆయన మృతి చెందినట్లు బంధువులు అంటున్నారు.
మందడంలో బెజవాడ సామ్రాజ్యమ్మ గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని కోసం ఆమె 20 ఎకరాలు ఇచ్చారు. రాజధాని తరలిపోతుందనే ఆందోళనతోనే ఆమె చనిపోయినట్లు బంధువులు అంటున్నారు. అమరావతి ఆందోళనల్లో సామ్రాజ్యం కుటుంబసభ్యులు పాల్గొంటున్నారు. ఆమె కుమారుడు గోపాలరావును ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. కొడుకును పోలీసులు కొట్టారని సామ్రాజ్యమ్మ మనస్తాపానికి గురైందని బంధువులు తెలిపారు.