రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలోని ప్రధాన ఆలయాలతోపాటు, రద్దీ అధికంగా ఉండే దేవస్థానాల్లో.. తితిదే ఆచరిస్తున్న విధానాలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆ శాఖ అధికారుల బృందాలు రెండు విడతల్లో తిరుమలలో వారం రోజుల పాటు ఉండి అన్ని విభాగాలపై అధ్యయనం చేశాయి. ఇతర దేవస్థానాల్లో ఆచరించదగిన అంశాలపై నివేదిక రూపొందించాయి. దీనిపై ఆ శాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్ గురువారం సమీక్షించారు. అధికారులు గుర్తించిన అంశాలివీ..
- తితిదే పరిధిలో దుకాణాలు, స్థలాలు అద్దె, లీజు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. లీజుదారులు ఎంత అద్దె చెల్లించారు? బకాయి ఎంత? ఆలస్యమైతే జరిమానా ఎంత? తదితరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదవుతున్నాయి. వీటిని తగ్గించేందుకు, మార్చేందుకు వీల్లేదు. ఇతర ఆలయాల్లోని కొందరు లీజుదారులు ఏళ్లుగా అద్దె చెల్లించడంలేదు. దీన్ని ఆన్‌లైన్ చేయాలి.
- తిరుమల వ్యాప్తంగా, కాటేజీల్లో పరిశుభ్రత చర్యలు పక్కాగా చేపడుతున్నారు. దేవాదాయశాఖ ఆలయాల్లోనూ పారిశుద్ధ్య చర్యలతోపాటు, కాటేజీల్లో లైట్లు, ఫ్యాన్లు, పైపులు తదితర మరమ్మతు బాధ్యతను పారిశుద్ధ్య గుత్తేదారుకు అప్పగించాలి.
- ప్రసాదాలు, అన్నదానానికి కొనుగోలుచేసే కూరగాయలు చెడిపోకుండా తితిదే మాదిరిగా శీతల గిడ్డంగి సదుపాయం కల్పించుకోవాలి.మెకనైజ్డ్ కిచెన్‌ను అందుబాటులోకి తేవాలి.
- భక్తుల కదలికలపై ఆద్యంతం నిఘా కెమెరాల పర్యవేక్షణ పెంచాలి. అన్నిచోట్లా హుండీ లెక్కింపును అత్యంత పకడ్బందీగా పర్యవేక్షించాలి.
- తితిదేలో ప్రీ, పోస్ట్, వార్షిక ఆడిట్ విధానం పక్కాగా ఉంటుంది. ఏటా నగల ఆడిటింగ్ కూడా చేస్తున్నారు. దీన్ని అంతటా వర్తింపజేయాలి. భక్తులకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు కొనుగోళ్లన్నీ కాగితరహితంగా, ఆన్‌లైన్‌లో సాగుతున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లోనూ ఈ విధానం ప్రవేశపెట్టాలి.
ఇదీ చదవండి: