తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నారు. ఆదివారం చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. కార్మికులతో ఇక చర్చలు లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడమే అగ్నికి ఆజ్యం పోసినట్లైంది.
బతికుంటే మళ్లీ వస్తా...
టీఆర్ఎస్ సర్కార్ ప్రకటనతో మనస్తాపానికి గురైన ఖమ్మం డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్ అపోలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు.
మరో కార్మికుడు ఆత్మహత్య
ఇటు హైదరాబాద్‌లోనూ మరో కార్మికుడు ఆత్యహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలోని రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సురేందర్‌గౌడ్ ఇంట్లో ఉరివేసుకొని చనిపోయాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఉద్యోగం పోయిందన్న బాధతో సురేందర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక్కరోజే ఇద్దరు కార్మికులు బలిదానం చేసుకోవడంతో తెలంగాణ వ్యాప్తంగా కార్మికులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో పలు జిల్లాలో ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంబించింది. ప్రజలు గమ్యానికి చేరేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు
ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కార్మికులు నిరసన చేపట్టారు. నల్గొండ జిల్లాలో ప్రదర్శనలు జరిగాయి. యాదాద్రిలో డిపో ముందు మౌన ప్రదర్శన చేసేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం - విద్యార్థి సంఘాలు
- టీఎస్ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
- ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ‘వంటావార్పు’ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా 14న మంత్రుల కార్యాలయాల ముట్టడి, 16న ఓయూలో భారీ ర్యాలీ, 19న విద్యాసంస్థల బంద్, 21న ప్రగతిభవన్ ముట్టడి నిర్వహించనున్నట్లు విద్యార్థి నాయకులు తెలిపారు.
ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ మద్దతు
- తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆంధ్రపద్రేశ్‌లో అన్ని డిపోల వద్ద ధర్నాలు నిర్వహించారు.
- తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా 19న ఏపీలో ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు దామోదరరావు, వైవీ రావు ప్రకటించారు.
ఇదీ చూడండి