రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో తెలంగాణలోని గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. పల్లె ప్రగతి, రోజువారీ పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ఖాతాల్లో నిధులు లేకపోవడంతో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు ఆస్తిపన్ను, ఇతర రూపాల్లో సొంతంగా సమకూరిన ఆదాయాన్నీ వాడుకునేందుకు వీల్లేకుండా ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో పంచాయతీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.
గ్రామాల్లో పల్లెప్రగతి, రోజువారీ కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రతినెలా రూ.227.50 కోట్లు ఇస్తోంది. ఈ నిధులను పంచాయతీల్లో విద్యుత్తు బిల్లుల చెల్లింపు, ట్రాక్టర్ ఈఎంఐ, పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు, వీధిదీపాల మరమ్మతులు, ఇతర పనుల కోసం ఖర్చుచేస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి ఆగస్టు, సెప్టెంబరు నెలలకు... కేంద్ర ఆర్థిక సంఘం నుంచి జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు నిధులు విడుదల కాలేదు.గత రెండు నెలలకు సంబంధించి పంచాయతీలకు రూ.455కోట్లు రావాల్సి ఉంది. అక్టోబరు నెలకు సంబంధించిన నిధులను కలిపితే రూ.682.5కోట్లు అవుతుంది.
15వ ఆర్థిక సంఘం నిధుల్ని నేరుగా పంచాయతీలకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరవాలని సూచించింది. ఖాతాలు తెరిచి నెలలు గడుస్తున్నా నిధులు మాత్రం జమకావడం లేదు. పంచాయతీ ఖాతాల్లో నేరుగా నిధులు జమయితే, వాటిని స్థానికంగా అభివృద్ధి పనులకు వినియోగించవచ్చని సర్పంచులు భావించారు. కానీ మూడు నెలలుగా పైసా రాలేదు.
దీంతో సర్పంచులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శులు విద్యుత్తు బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలకు చెక్కులను సిద్ధం చేయలేకపోతుండడంతో వారు ఇరుకున పడుతున్నారు. ఖాతాల్లో నిధులు లేకపోవడంతో సకాలంలో బిల్లులకు సంబంధించి చెక్‌లు సిద్ధం చేయలేదన్న కారణంతో ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో 36 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో ఆలస్యమైందని గ్రహించి, వాటిని షోకాజ్ నోటీసులుగా మార్చింది.
ఇదీ చూడండి: