ముఖ్యమంత్రి జగన్ నేడు దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి.... పలు అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం బయల్దేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్తారు. సీఎంతో పాటు పలువురు ఎంపీలు దిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు దిల్లీ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయి... పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
రాజధాని భూములపై సీబీఐ విచారణ జరపాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరగా.... ఆ దిశగా ఆదేశాలు వెలువడలేదు. ఈ అంశంపై సీఎం చర్చించనున్నట్లు తెలిసింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపైనా చర్చించి... సీఎం జగన్ అభిప్రాయాన్ని అమిత్ షా తెలుసుకుంటారని సమాచారం. వీటితో పాటు మూడు రాజధానులపై రాష్ట్రం చేసిన చట్టం అమలుకు సహకరించాలని సీఎం కోరనున్నట్లు సమాచారం. పోవవరం ప్రాజెక్టుకు నిధుల మంజూరు సహా విభజన చట్టంలోని పలు అంశాల అమలుపై కేంద్ర హోం మంత్రితో జగన్ చర్చిస్తారని తెలిసింది. అవకాశం ఉంటే మరి కొందరు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానిని కలిసే అంశంపై ఎలాంటి స్పష్టత రాలేదు..
ఇదీ చదవండి