తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నగరానికి సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. మౌలిక వసతులు సహా ఇతర కార్యక్రమాల అమలుతో పాటు కొత్తగా చేపట్టాల్సిన వాటిపై చర్చించనున్నారు. ఇటీవలి వర్షాల కారణంగా నష్టపోయిన వారికి రూ. 10 వేల సాయం, ఇళ్లు దెబ్బతిన్న వారికి పరిహారం, రహదార్లు, నాలాల అభివృద్ధి, మరమ్మతులు తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. కొన్ని కీలక నిర్ణయాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది.
రెవెన్యూ, భూసంబంధిత యాజమాన్యాల హక్కులకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రకటించినందున.. ఆ దిశగా చర్చించి నిర్ణయాలు తెలుసుకునే అవకాశం ఉంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ తదితరాలకు సంబంధించి కొన్ని చట్టసవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. అటు సన్నరకాల ధాన్యం పండించిన రైతుల విషయమై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
సన్నాలు పండించిన వారికి బోనస్ ఇస్తామని కొడకండ్ల సభలో సీఎం కేసీఆర్ తెలిపారు. సన్నాలను 2500 క్వింటాలుకు కొనుగోలు చేయాలని ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. ఈ విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా మంత్రివర్గం ముందుకొచ్చే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మూడు నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయమై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: