సికింద్రాబాద్‌లో 8 మందిని బలితీసుకున్న.. రూబీ హోటల్ ఘోర అగ్నిప్రమాద ఘటన నగరవాసులను మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాదం జరిగిన తీరు.. తప్పించుకునేందుకు ఉన్న అతి తక్కువ అవకాశాలను చూస్తే ఇంకా ఎక్కువ ప్రాణనష్టం జరిగే పరిస్థితులే ఉన్నాయి. కానీ.. దుర్ఘటన గురించి తెలిసిన క్షణాల్లోనే.. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రదర్శించిన అద్భుత సమయస్ఫూర్తి మిగతా హోటల్‌లో చిక్కుకున్న వారందరి ప్రాణాలను నిలబెట్టింది. వీరిలో ప్రధానంగా ముగ్గురు సహాయక సిబ్బంది చేసిన సాహసానికి మాత్రం చేతులెత్తి మొక్కాల్సిందే.
సోమవారం రాత్రి 10 గంటల 37నిమిషాలకు జెమోపాయ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, రూబీ లాడ్జ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌కాల్ రాగా.. ఐదు నిమిషాల్లోనే స్కైలిఫ్ట్‌తోపాటు ఓ ఫైర్‌ఇంజిన్ అక్కడికి చేరుకున్నాయి. మరో 15నిమిషాల్లో వాటర్ ట్యాంకర్లు, ఆ తర్వాత పొగ నియంత్రణ వాహనం, సహాయక వాహనం రంగంలోకి దిగాయి. ముందుగానే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారి మోహన్‌రావు.. బ్రాంటో లిఫ్ట్ సాయంతో హోటల్‌లోకి వెళ్లారు. మంటల్లో కేకలు పెడుతున్న వారికి ధైర్యం చెప్పిన ఆయన.. చాకచక్యంగా బయటకు తీసుకువచ్చారు. పైఅంతస్తుతో పాటు రెండో అంతస్తులో మెట్ల మార్గంలో చిక్కుకున్న మరో వ్యక్తిని అతి కష్టం మీద బయటకు పంపారు. ఆ తర్వాత కాలిన గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న నలుగురిని అతికష్టం మీద మోహన్‌రావు బయటికి తీసుకురాగా.. వారు ఆస్పత్రిలో మృతిచెందారు.
సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించిన మరో వ్యక్తి.. కానిస్టేబుల్ రాకేశ్. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న సమయంలో.. రూబీ హోటల్ నుంచి పోలీసులకు డయల్ 100 ద్వారా ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ రాకేశ్.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాడు. పరిస్థితిని చూసి.. టార్చ్‌లైట్ సాయంతో ఒంటరిగా భవనంలోకి వెళ్లాడు. ఐదో అంతస్తులో మంటల్లో చిక్కుకున్న ఇద్దరిని టార్చ్ సాయంతో గుర్తించి.. వారిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చాడు. మళ్లీ భవనంలోకి వెళ్లి.. అప్పటికే అక్కడ కుప్పకూలిపోయిన ఓ వ్యక్తిని తీసుకురావటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. రెండో అంతస్తులో ఉన్న మరో ఇద్దరిని రాకేశ్ క్షేమంగా బయటికి పంపించాడు. ఈ క్రమంలో భవనంలో కమ్ముకున్న పొగ పీల్చడటంతో.. రాకేశ్ అస్వస్థతకు గురయ్యాడు. అతికష్టం మీద బయటికి వచ్చిన రాకేశ్‌కు వైద్యులు చికిత్స అందించారు.
తూకారాంపేట్ ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు సైతం ఈ సహాయక చర్యల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. మంటలు ఎగిసిపడుతున్న క్రమంలో బాధితులను రక్షించేందుకు వెళ్లిన ఆయన.. రూబీ హోటల్ పక్కనున్న భవనంపైకి చేరుకుని.. నిచ్చెన సాయంతో హోటల్ భవనంలోకి ప్రవేశించారు. అనంతరం.. అందులో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా సీఐ ఆంజనేయులు బయటికి చేర్చారు. అగ్నిమాపకశాఖ అధికారి మోహన్‌రావు, కానిస్టేబుల్ రాకేశ్, సీఐ ఆంజనేయులు.. ఈ సహాయక చర్యల్లో ప్రదర్శించిన సాహసంతో పదుల సంఖ్యలో ప్రాణాలు నిలబడ్డాయి. విపత్తు వేళ ప్రాణాలను లెక్కచేయకుండా.. బాధితులను కాపాడేందుకు ఈ ముగ్గురి సమయస్ఫూర్తికి సెల్యూట్ చేయాల్సిందే.
ఇవీ చూడండి: