తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వద్ద అప్పు తీసుకున్న మిత్రులు.. తిరిగి చెల్లించమన్నందుకు వ్యాపారిని హత్య చేశారు. చార్మినార్‌కు చెందిన మధుసూదన్ రెడ్డి వద్ద ముగ్గురు మిత్రులు రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ నెల 19న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు మధుసూదన్‌రెడ్డిని కిడ్నాప్ చేసి సంగారెడ్డికి తీసుకెళ్లారు. అనంతరం ఆయనను చంపి పూడ్చిపెట్టారు.
ఈ నెల 19 నుంచి మధుసూదన్ రెడ్డి కనిపించకపోవడంతో.. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి. 19వ తేదీ రాత్రే మధుసూదన్ రెడ్డిని హత్య చేసి.. దిగ్వాల్ వద్ద పాతిపెట్టినట్లు నిందితులు పోలీసుల ముందు అంగీకరించారు. పూడ్చిన ప్రదేశాన్ని వారు చూపించడంతో పోలీసులు మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు.
ఇదీ చదవండి: దూడను ఢీకొట్టిన బస్సు..రెండు గంటలపాటు నరకయాతన