రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ నిర్వహణకు చేసిన ఖర్చుల్లో ఈ ఏడాది అప్పుల వాటానే ఎక్కువ. గతంలో ఎన్నడూ ఇలా లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు ఆఖరు వరకు కాగ్ ఖరారు చేసిన లెక్కల్ని పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తే ఎన్నడూ లేనంతగా ఏకంగా 51.73 శాతం మేర అప్పు చేసిన పరిస్థితి. సాధారణంగా అప్పులు తక్కువ, ఆదాయం ఎక్కువ అయితే ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. చేసిన అప్పునూ వనరుల కల్పనకు ఖర్చు చేయగలిగితే అది సద్వినియోగం చేసినట్లుగా పేర్కొంటారు. తాజాగా 2019 మార్చి ఆఖరు దాకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కాగ్... అప్పుల్ని వనరుల కల్పనపై ఖర్చు చేయకపోవడం ఆందోళనకర పరిణామంగా పేర్కొంది.
మరోవైపు 2026 నాటికి రూ.లక్ష కోట్లకు పైగా అప్పు తీర్చాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని విశ్లేషిస్తూ సమగ్ర ఆర్థిక వ్యూహం లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ఈ ఏడాది రాష్ట్ర పరిస్థితి మరీ దారుణంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. మొత్తం అన్ని లెక్కలనూ కరోనా ప్రభావితం చేసిందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు ఏడేళ్ల పరిస్థితిని... అక్టోబరు ఆఖరు నాటికి ఉన్న కాగ్ గణాంకాల్ని పరిశీలిస్తే 2017లోనూ అప్పు వాటా ఎక్కువే. ఆ ఏడాది మొత్తం ఖర్చులో 40 శాతం మేర రుణాల రూపంలోనే సమీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయి ఏకంగా సగం కన్నా ఎక్కువ మొత్తం రుణంగానే సమకూర్చుకుని ప్రభుత్వ నావను నడిపించాల్సి వచ్చింది.