అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం ఈ నెల 12కు 300 రోజులకు చేరనుంది. ఈ క్రమంలో 11, 12వ తేదీల్లో పెద్ద ఎత్తున నిరనస కార్యక్రమాలు నిర్వహించాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు వంటి వివిధ వర్గాల ప్రతినిధుల భాగస్వామ్యంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో ఐకాస కన్వీనర్ ఏ.శివారెడ్డి, సహ కన్వీనర్లు గద్దె తిరుపతిరావు, మల్లికార్జునరావు, రైతు ఐకాస సహ కన్వీనర్ సుధాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రుల రాజధాని అమరావతి - సమరభేరి పేరిట జరిగే నిరసనల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని విజ్ఞప్తి చేశారు.
11వ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్లలో ఐదు కిలోమీటర్ల మేర అమరావతి పరిరక్షణ ర్యాలీలు... 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద నిరసనదీక్షలు చేయాలని ఐకాస కార్యాచరణ రూపొందించిందన్నారు. ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు, కొందరు మంత్రులు కుసంస్కారంతో మాట్లాడుతున్నారని... ఆడవాళ్లు అని కూడా చూడకుండా ధూషిస్తున్నారని ఆరోపించారు. అమరావతి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతున్నాయా? అన్న సందేహం కలుగుతోందన్నారు. 300వ రోజు ఉద్యమం తర్వాత రాష్ట్రం వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు ఆగిపోవడానికి పక్క రాష్ట్రంతో క్విడ్ ప్రో కో ఒప్పందమే కారణమనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోందని వారు అన్నారు.
ఇదీ చదవండి: 'అధికార బలంతో మంత్రి జయరాం భూములు కొన్నారు'