స్వయం సహాయ సంఘాల సభ్యుల బ్యాంకు రుణాలను నేరుగా చెల్లించే వైఎస్‌ఆర్ ఆసరా పథకాన్ని సీఎం జగన్ శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి ఆరంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87.74 లక్షల మంది డ్వాక్రా సంఘాల సభ్యుల ఖాతాల్లో రూ.6,792.20 కోట్లు జమ చేయనున్నారు. రాష్ట్రంలో 8.71 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉండగా, వీటికి గత ఏడాది ఏప్రిల్ 11 నాటికి రూ.27,168.83 కోట్ల మేర బ్యాంకుల్లో రుణాలు ఉన్నాయి. వీటిని నాలుగు విడతల్లో చెల్లించాలని నిర్ణయించారు. తొలి విడత నిధులను శుక్రవారం వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. వీటిని ఆయా సభ్యులు తమ అవసరాలకు ఖర్చు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పాత బాకీ కింద బ్యాంకులు జమ చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. లబ్ధిదారుల జాబితా ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచారని, అర్హుల పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలని విచారణ జరిపి మంజూరు చేస్తారని అధికారులు తెలిపారు.
- కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: బొత్స
ఒకేసారి ఇంత మంది డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చే పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. దీనిపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లోని 15 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.1,186 కోట్లు జమ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు వార్డు సచివాలయాలు, పురపాలిక కార్యాలయాల వద్ద ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రాజధానిపై పార్లమెంటుకే అధికారం: చంద్రబాబు