MP Raghurama Raju Case: ఎంపీ రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టినట్లు ఆరోపణలు ఉన్న కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు వినకుండా తాము ఏమీ చేయలేమని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ అప్లికేషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అందుకు రెండు వారాల సమయం ఇస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. 2021 మే నెలలో తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు కస్టడీలో తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని, ఆ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఎంపీ రఘురామ తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది.
ఈ కేసు 2021 మే 25న విచారణకు వచ్చినప్పుడు అప్పటి ధర్మాసనం ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేస్తూనే, పిటిషనర్ విజ్ఞప్తి మేరకు 2 నుంచి 7 వరకు ఉన్న ప్రతివాదులను (రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ అధికారులు, జగన్‌మోహన్‌రెడ్డి) తొలగించడానికి అనుమతి ఇచ్చింది. పిటిషనర్ కోరిక మేరకే తొలగిస్తున్నట్లు అందులో పేర్కొంది. బుధవారం విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్ ఆ విషయాన్ని ప్రస్తావించారు. 2 నుంచి 7 వరకు ప్రతివాదులుగా ఉన్నవారే చిత్రహింసలకు కారణమని చెప్పారని, కానీ వారి పేర్లను ఇదివరకే తొలగించారని గుర్తు చేశారు.
జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ గతేడాది వేసవి సెలవుల సమయంలో అమరావతి జైలులో ఉన్న ఎంపీని సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రికి తీసుకెళ్లమని ఆదేశించిన కేసేనా ఇది అని ప్రశ్నించారు. అదే కేసని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు కోర్టుకు విన్నవించారు. కేసులో ప్రతివాదులను తొలగించినప్పుడు తామెలా స్పందించగలమని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయవాది ఆదినారాయణరావు బదులిస్తూ.. ఇక్కడ చిత్రహింసలకు గురి చేసింది పోలీసులేనని, 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కేసులో నిందితులుగా ఉన్న వారి వాదనలు వినడానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీనికి స్పందించిన జస్టిస్ గవాయ్.. మీరు ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ హోంశాఖను తొలగించారని, కానీ దర్యాప్తు చేయాల్సింది ఏపీ పోలీసులే కదా అని ప్రశ్నించారు.
వాళ్లు కనీసం కేసు నమోదు చేయడానికి అంగీకరించలేదని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మీరు ముందుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు..? నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఇప్పుడు విచారణకు తాము సుముఖత చూపడం లేదని, హైకోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. ఏడాదిన్నర తర్వాత హైకోర్టుకు వెళ్లమని చెబితే అక్కడ మళ్లీ తొలి నుంచి విచారణ మొదలవుతుందని, ఈ ఏడాదిన్నర సమయం వృథా అవుతుందని న్యాయవాది పేర్కొన్నారు. జస్టిస్ బీఆర్ గవాయి స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరోక్షంలో తాము ఏమీ వినదలచుకోలేదన్నారు. దాంతో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ దరఖాస్తు చేసుకోవడానికి తమకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది కోరారు. ‘ఇదివరకు తొలగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మళ్లీ ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరుతున్నారు. ఆ దరఖాస్తు దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కోరారు. ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవచ్చా లేదా అన్నది మేం పరిశీలిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేస్తూ కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: